తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా, అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి పది పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మే 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి, ఆ మరుసటి రోజు నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. ఈ ఏడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు నిర్వహించనున్నారు. నాలుగు ఎఫ్ఏ టెస్టులకు గానూ రెండు ఎఫ్ఏ టెస్టులను మాత్రమే నిర్వహించనున్నారు. మొదటి ఎఫ్ఏను మార్చి 15 నాటికి, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయనున్నారు. సమ్మేటివ్ అసెస్‌మెంట్‌ను మే 7 నుంచి 13వ తేదీ మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థులకు పూర్తిస్థాయి హాజరు శాతం లేకున్నప్పటికీ వార్షిక పరీక్షలకు అనుమతివ్వనున్నారు. అలాగే వారిని కూడా రెగులర్ విద్యార్థులుగా పరిగణించనున్నారు.