ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ 175 స్థానాలలో పోటీ చేయడం ద్వారా కనీసం 5 నుంచి 6 స్థానాలలో అయినా విజయం సాధించాలని ఆయన అనుకుంటున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇతర పార్టీలను నిర్వీర్యం చేసి వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఎదిగే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.
బీఆర్ఎస్ ఏపీలో అధికారంలోకి వస్తే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న పథకాలనే ఏపీలో కూడా అమలు చేస్తామని చెబుతోంది. ఏపీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే పార్టీలో చేరే నేతలు వైసీపీ నేతలా? లేక టీడీపీ నేతలా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.
రాష్ట్రంలో ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ప్రజల మనస్సును మార్చడంలో సఫలమైతే బీఆర్ఎస్ కు కూడా భవిష్యత్తు ఉంటుంది. ప్రధానంగా విభజన విషయంలో కేసీఆర్ పై ఏపీ ప్రజల్లో ఉన్న కోపం అంతాఇంతా కాదు. ఏపీ ప్రజల మనస్సును గెలుచుకోవడానికి కేసీఆర్ ఏ విధంగా ముందడుగులు వేస్తారనే చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏపీలో బీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయేమో చూడాలి.
తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేక పరిస్థితులు ఉన్నా బలమైన ప్రత్యామ్నాయం లేదు. రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందేమో చూడాలి. ఉచిత విద్యుత్, దళిత బంధు, రైతు బంధు పథకాలను తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తానని కేసీఆర్ చెబుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఏపీలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.