నారా లోకేష్ ఎక్కడ.? తెలుగు తమ్ముళ్లు వెతుకుతున్నారహో.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. రాష్ర్టంలో రెండే రెండు ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి. ఒకటి 150 కి పైగా ఎమ్మెల్యేలున్న అధికార వైఎస్సార్‌సీపీ. రెండోది గత ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచిన జనసేన పార్టీ. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేనను వీడి వైసీపీలో చేరిపోయారాయె.

‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మార్చిన రాజకీయ సమీకరణమిది. ఇంతకీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎక్కడా.? చంద్రబాబు ప్రెస్ మీట్లు లేవు. జూమ్ మీటింగులు అసలే లేవు. నారా లోకేష్ సుడిగాలి పర్యటనలూ లేవు. ముఖ్యమంత్రి పైన లోకేష్ పొలిటికల్ పంచ్‌లూ లేవు. అసలేం జరుగుతోంది.? టీడీపీలో ఎందుకింత నైరాస్యం.

తెలుగు సినీ పరిశ్రమలో టీడీపీకి బోలెడంత మంది మద్దతుదారులున్నారు. కానీ, సినీ పరిశ్రమ సమస్యలపై వాళ్లెవరూ గట్టిగా నిలబడలేకపోతున్నారు. ఈ గ్యాప్ పవన్ కళ్యాణ్‌కి బాగా ఉపయోగపడింది. అధికార వైసీపీతో పవన్ పోరాటం వల్ల ఏం జరగబోతోంది.? అనేది వేరే చర్చ.

వైసీపీని ఓడించేంత సీన్ ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్‌కి లేదు. కానీ, ఈ సున్నితమైన సమయంలో, ఈ కీలకమైన సమయంలో టీడీపీ గైర్హాజరు.. అందునా టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ అజ్ఞాతవాసం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ, జనసేన కుమ్మక్కులో ఇదీ ఓ భాగమని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలే జనాల్లోకి బలంగా వెళ్లాలని టీడీపీ కోరుకుంటోంది.

వాస్తవానికి విపక్షాలని ఒక్క తాటిపైకి తేవాల్సిన బాధ్యతను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎప్పుడో విస్మరించింది. ఇదే రాజకీయ వ్యూహం మున్ముందు టీడీపీ వ్యవహరిస్తే, తద్వారా టీడీపీ అంతర్ధానమై, ఆ స్థానంలో జనసేన వెలుగులు విరజిమ్మే అవకాశముంది. ఈ భయంతోనే నారా లోకేష్ ఎక్కడ.? అంటూ తెలుగు తమ్ముళ్ళు విలవిల్లాడిపోతున్నారు.