దేశ రాజకీయాల్లోకి తెలుగు పార్టీ.! కేటీయార్ వ్యాఖ్యలు వైరల్.!

దేశ రాజకీయాల్లోకి తెలుగు పార్టీ వెళ్ళబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ మంత్రి కూడా అయిన ఇదే కేటీయార్, గతంలో ‘తెలుగు తల్లి ఎవడికి తల్లి.. మాకు మా తెలంగాణ తల్లి వుంది..’ అంటూ నినదించారాయె.

ఇప్పుడేమో, తెలుగు పార్టీ.. జాతీయ రాజకీయాల్ని శాసించేందుకు సిద్ధమవుతోందంటూ వ్యాఖ్యానించడం విశేషమే మరి.! రాజకీయం అంటేనే ఇంత.. పూటకో మాట.! నిన్న తప్పన్నది, నేడు ఒప్పవుతున్నది. నేడు ఒప్పు అన్నది, రేపు తప్పవుతుంది.

అసలు విషయం తెలుసు కదా.? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి అవ్వాలనుకుంటున్నారు.! విషయమైతే ఇదే.! అది సాధ్యమా.? కాదా.? అన్నది వేరే చర్చ. ‘ఏం ఎందుకు కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించగలమని అనుకున్నామా.? అలాగే, కేసీయార్ ప్రధాని అవుతారంటే ఇప్పుడు వెక్కిరిస్తున్నవారే, రేపు ఆయన ప్రధాని అయ్యాక జేజేలు పలుకుతరు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు నినదిస్తున్నారు.

విజయదశమి ముహూర్తం ఖరారైంది కేసీయార్ కొత్త పార్టీ ప్రకటనకి. అది తెలుగు పార్టీ అట.. జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతోందట. పార్టీ పాతదే, కాకపోతే.. పేరు మాత్రం కొత్తది. ఇప్పటికి అది తెలంగాణ రాష్ట్ర సమితి. రేప్పొద్దున్న అది భారత రాష్ట్రీయ సమితిగా మారబోతోంది. విజయదశమి రోజున కేసీయార్ స్వయంగా ఈ పేరుని ప్రకటించబోతున్నారట.

ఇలా ఏర్పడబోయే కొత్త పార్టీనే తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, తెలుగు పార్టీ అంటున్నారు. మార్పు మంచిదే.! కాకపోతే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోకపోయి వుంటే, తెలుగు రాష్ట్రం నుంచి ఓ పార్టీ, జాతీయ స్థాయికి ఎదగడం కాస్త తేలికయ్యేది.