Bharata Ratna : తెలుగు రత్నాలేగానీ, భారత రత్న మాటేమిటి.?

Bharata Ratna :  స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం అంటారు కొందరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలోనూ ఇలాంటి మాటే వినిపిస్తుంటుంది. మరీ, ఆత్మగౌరవం లాంటి పెద్ద పెద్ద మాటలు ఇలాంటి నేతల విషయంలో మాట్లాడేయడం అసంబద్ధం. రాజకీయ, సినీ అభిమానాల్లో భాగంగా ఆయా నేతలపై ‘ఆత్మగౌరవం’ అంటూ అనేస్తుంటారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం.. అంటే, దానికి చాలా లెక్క వుంది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య కంటే తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడగలం.? కందుకూరి వీరేశలింగం, అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు.. ఇలాంటి మహనీయులెందరో వున్నారు ఆ ‘ఆత్మగౌరవం’ కేటగిరీలో. జల్ జంగల్ జమీన్.. అంటూ నినదించిన కొమరం భీమ్ లాంటోళ్ళనీ ఈ ఆత్మగౌరవం లెక్కల్లో వెయ్యాలి.

సరే, ఆ సంగతి పక్కన పెడదాం. ప్రతిసారీ స్వర్గీయ ఎన్టీయార్ విషయంలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో భారత రత్న గురించిన ప్రస్తావన వస్తుంటుంది. మహనీయులకే దక్కని భారతరత్న విషయంలో రాజకీయాల్ని చూస్తున్నాం. అందుకే, రాజకీయ నాయకులకు భారతరత్న అనే మాట చాలా చులకన వ్యవహారమైపోయింది.

‘కొనుక్కుంటే అవార్డులు వస్తాయ్..’ అన్న మాట భారతరత్న సహా పద్మ పురస్కారాల విషయంలో వింటూనే వున్నాం. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, కేంద్రంలో చక్రం తిప్పిన సమయంలో ఏనాడూ భారత రత్న గురించి మాట్లాడలేదు ఎన్టీయార్ విషయమై. ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా.

కానీ, కొందరు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు.. ఎవరి మెప్పు కోసమో.. ఈ భారత రత్న డిమాండ్‌తో అటు ఎన్టీయార్, ఇటు వైఎస్సార్‌లను అవమానిస్తున్నారేమోనన్న అనుమానాలు కలగకమానవు.