విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే, చేసిన రాజీనామాని ఆమోదించుకోవడంలో ఆయన చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు.
మొత్తంగా అందరూ రాజీనామాలు చేస్తే, విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం దిగొస్తుందని గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. ఇదిలా వుంటే, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని కలిశారు గంటా శ్రీనివాసరావు తాజాగా. ‘విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తామన్నారు కదా.. మాటకు కట్టుబడి విశాఖకు రండి..’ అని కేటీఆర్‌ని కోరారు గంటా. అసలు, విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ నుంచి మద్దతు అవసరమా.? అన్నదిక్కడ కీలకమైన ప్రశ్న. అంతకన్నా ముందు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గంటా శ్రీనివాసరావు కలిసి వుండాలి. ఆ మాటకొస్తే, టీడీపీ అధినేత చంద్రబాబుని ఇంకా ముందుగా కలవాల్సి వుంది గంటా. కానీ, ఇక్కడ గంటా శ్రీనివాసరావు విశాఖలో తన ‘పరపతి’ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఈ వ్యూహాల్ని అర్థం చేసుకోలేనంత అమాయకులా విశాఖ వాసులు.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది. కేంద్రం అనుకుంటే, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రపదేశ్ ఏదన్నా సాధించగలదు.. అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? విశాఖ రైల్వే జోన్ వ్యవహారంలో అయినా, ప్రత్యేక హోదా వ్యవహారంలో అయినా, పోలవరం ప్రాజెక్టు విషయంలో అయినా, అమరావతి విషయంలో అయినా రాష్ట్రం ఏం సాధించింది.? కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు విషయంలోనూ రాష్ట్రానిది పూర్తి ఫెయిల్యూర్ హిస్టరీ కేంద్రాన్ని ఒప్పించడంలో.
తెలంగాణ రాష్ట్రం, తమకు కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతోంది. ఇక, పోలవరం విషయంలోనూ, ప్రత్యేక హోదా విషయంలోనూ గందరగోళ వ్యాఖ్యలు గతంలో చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విశాఖ ఉక్కుకి మద్ద లభిస్తుందా.? లభించినా అందులో విశ్వసనీయత వుంటుందా.?