తెలుగు రాష్ర్టాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ లో కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సామాన్యులు సహా పలవురు రాజకీయ నాయకులు, వాళ్ల కారు డ్రైవర్లు మహమ్మారి బారిన పడ్డారు. మరోవైపు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన పలువురు అధికారులు కూడా వైరస్ తో బాధపడుతున్నారు. అటు టాలీవుడ్ సెలబ్రిటీలలో ఒకరైనా నిర్మాత బండ్ల గణేష్ కూడా వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకిన వారందర్నీ ఐసోలేషన్ కి తరలించి వేర్వేరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అయితే ఆయనకు వైరస్ ఎలా సోకింది అన్నది ఇంకా బయటకు తెలియలేదు. ప్రస్తుతం ఆయన్ని అపోలో ఆసుపత్రిలో ఉంచి చికి్త్స అందిస్తున్నారు. దీంతో వీహెచ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది అభిమానులు అపోలో ఆసుపత్రికి చేరుకుని డాక్టర్లు విడుదల చేసే హెల్త్ బులిటన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీ.హెచ్ వయసురీత్యా పెద్దాయన కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. మహమ్మారి వయసుమీద పడిన వారిపైనా, చిన్న పిల్లలపైనా అధికంగా ప్రభావం చూపిస్తోంది. ఇరువురిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే అందుకు ప్రధాన కారణం.
కాగా శనివారం ఒక్కరోజే తెలంగాణలో 546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య ఇప్పటివరకూ 7072కు చేరుకున్నాయి. ప్రస్తుతం 3363 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు, వైద్యం విషయంలో చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అసుపత్రులతో పాటు ప్రయివేటు ఆసుపత్రులు కరోనాకు చికిత్స అందించవచ్చు అని తెలిపింది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పేదవాడికి కరోనా సోకితే లక్షల రూపాయలు ఎక్కడ నుంచి తెచ్చి పెట్టాలి? దానికి బాద్యత వహించేది ఎవరు? జాతీయ విపత్తుగా ప్రకటించిన జబ్బుకు సామాన్యుడు జేబు గుల్ల అవ్వాలా? అని మండపడుతున్నారు.