తెలంగాణ రాజకీయం: హరీష్ రావుకి రెండో స్ట్రోక్.!

ఈటెల రాజేందర్ ముందే హెచ్చరించారు.. హుజూరాబాద్ నియోజకర్గ ఉప ఎన్నిక విషయమై హరీష్ రావుని కేసీయార్ బలిపశువుని చేస్తున్నారని. కానీ, హరీష్ రావు మాత్రం ఈటెల హెచ్చరికని లైట్ తీసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయమై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పూర్తి బాధ్యత తీసుకుని, ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టించారు హరీష్ రావు.

గతంలో.. అంటే దుబ్బాక ఉప ఎన్నిక విషయంలోనూ హరీష్ రావుదే బాధ్యత అంతా. అక్కడ దుబ్బాకలోనూ గులాబీ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ సేమ్ రిజల్ట్. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, దుబ్బాక రఘునందన్ రావు విషయంలో అయినా, హుజూరాబాద్ ఈటెల రాజేందర్ విషయంలో అయినా, అధికార పార్టీ అత్యుత్సాహమే కొంప ముంచేసింది.

రఘునందన్, ఈటెల.. ఇద్దరూ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నాయకులే. అదే అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి రెండు చోట్లా గట్టి దెబ్బ తగలేలా చేసింది. 6 వేల నుంచి 20 వేల రూపాయలదాకా ఓటు కోసం అధికార పార్టీ ఖర్చు చేసిందనే ప్రచారం వుంది. అంతేనా, తనను ఓడించేందుకు ఏకంగా 500 కోట్లు కేసీయార్ ఖర్చు చేయిస్తున్నారనీ ఈటెల ఆరోపించారు.

‘ఎవరెన్ని కుట్రలు పన్నినా నా గెలుపుని అడ్డుకోలేరు..’ అని ప్రకటించిన ఈటెల, ఎలాగైతేనేం.. బంపర్ విక్టరీ సాధించేశారు. అసలు ఈటెల మీద బలమైన నాయకుడ్ని నిలబెట్టాల్సిన టీఆర్ఎస్, పెద్దగా పేరు లేని గెల్లు శ్రీనివాస్‌ని ఎందుకు బరిలోకి దింపినట్లు.? హరీష్ రావుని రాజకీయంగా దెబ్బకొట్టేందుకేనేమో.. అన్న చర్చ జరుగుతోంది.

హరీష్ రావు అంటే, తెలంగాణ రాష్ట్ర సమితిలో ట్రబుల్ షూటర్.. కీలక నేత. కేసీయార్ తర్వాత ఆ స్థాయి వున్న నాయకుడు. అంతేనా, కేసీయార్ కంటే పాపులారిటీ వున్న నాయకుడు. పార్టీలో కుటుంబ పోరు.. అన్న చర్చ జరిగిన ప్రతిసారీ హరీష్ రావుని వివాదాల్లోకి లాగడం గులాబీ నాయకులకి అలవాటే. ఇప్పుడే అదే జరుగుతోందేమో.! ఓటమికి హరీష్ రావుని బాధ్యుడిగా చూపుతున్నారు కొందరు గులాబీ నేతలు.. తెరవెనకాల.