తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టటానికి గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయటంతో అయన స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికీ అప్పగించాలి అనే దానిపై తీవ్ర చర్చలు జరుగుతున్నా నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుండి రాష్ట్ర కాంగ్రెస్ నేతలను హుటాహుటిన ఢిల్లీ రావాలని పిలుపులు వచ్చాయి. దీనితో గురువారం ఉదయం రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఢిల్లీకి పయనం అయ్యారు.
ఈ దఫాలో పీసీసీ అధ్యక్ష ఎంపిక ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి టీపీసీసీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మరో వర్గానికి చెందిన వ్యక్తికి సీడబ్ల్యూసీలో చోటు కల్పించనున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. అందుకోసమే కీలక నేతలకు ఢిల్లీకి పిలిపించి మంతనాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. పీసీసీ పదవి కోసం చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. ఈ రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లతో పాటు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, సంపత్ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, సీతక్క తదితరుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిల మధ్యే పోటీ ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
అయితే రాష్ట్రంలో అటు తెరాసను ఇటు బీజేపీని ధైర్యంగా ఎదుర్కునే సత్తా కలిగిన నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమెండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కోణంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి పేరు ముందు వరసలో వుంది. కేసీఆర్‌తో పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఇప్పటికే ఢీ అంటే ఢీ అనే విధంగా పోరాడుతున్న రేవంత్‌కి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని కూడా పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. దాదాపు 17జిల్లాల అధ్యక్షులు రేవంత్‌కి సానుకూలంగా ఉండగా 5గురు తటస్థంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మిగతావారు రేవంత్‌కి కాకుండా మిగతావారి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
అదే విధంగా ఆర్థికంగా కూడా రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ లో బలమైన రాజకీయ నేత అనుగ్రహం కూడా రేవంత్ రెడ్డికి పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అవసరం అయితే ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా ఆ నేత నిలిచే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆ కీలక ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డిని బలపరిచినట్లు తెలుస్తుంది. మరోపక్క మాణికం ఠాగూర్ కూడా దాదాపు 150 కీలక నేతల అభిప్రాయాలను సేకరించి వాటిని తీసుకోని ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే శుక్రవారం రాహుల్ గాంధీతో తెలంగాణ నేతల భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం లేకపోలేదు