Telangana: తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేత, మంత్రి ఈటెల రాజేందర్ మీద భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఈటెల తమ భూముల్ని కబ్జా చేశారంటూ మెదక్ జిల్లా మసాయిపేటకు చెందిన కొందరు, ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఫిర్యాదు చేశారు. తన భార్య పేరుతో హేచరీస్ నిర్వహిస్తున్న ఈటెల, ఆ సంస్థ కోసమే పెద్దయెత్తున అసైన్డ్ భూముల్ని లాక్కున్నారనీ, వాటిని రెగ్యలరైజ్ చేసుకునేందుకు అధికారులపై ఒత్తడి తెచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదిక తనముందుంచాలంటూ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
విజిలెన్స్ డీజీ, ఈ ఆరోపణలపై విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే, ఉద్యమ నాయకుడిగా, బీసీ నేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ తనదైన ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకున్నారు. కేసీఆర్ వెంట వుండి, తెలంగాణ ఉద్యమానికి తనవంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు ఈటెల. ఆ కారణంగానే ఈటెలకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోనూ, తెలంగాణ ప్రభుత్వంలోనూ కీలక పదవులు దక్కిన విషయం విదితమే. ఏమయ్యిందోగానీ, గత కొంతకాలంగా ఈటెలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత షురూ అయ్యింది. ఈ క్రమంలోనే ఈటెల కూడా, నర్మగర్భ వ్యాఖ్యలు పార్టీపైనా, ప్రభుత్వంపైనా చేశారు. ఈటెల సొంత కుంపటి పెట్టబోతున్నారనీ, బీజేపీలోకి వెళ్ళబోతున్నారనీ.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇంతలోనే, ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు రావడం, వచ్చినంతనే ముఖ్యమంత్రి కేసీఆర్, విచారణకు ఆదేశించడం.. ఇవన్నీ చూస్తోంటే, ఈటెల విషయంలో పొమ్మనలేక పొగపెడ్తున్న చందాన అధికార పార్టీ వ్యవహరిస్తోందన్న అనుమానాలు బలపడకమానవు. మరోపక్క, ఈటెల కూడా పార్టీకి, మంత్రి పదవికీ రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.