తెలంగాణలో ఏ ఎన్నికలైనా జరగనీ.. గెలుపు మాత్రం టీఆర్ఎస్ దే. ఇది పక్కా.. అని అంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ అయితే.. మేమే గెలుస్తున్నామంటూ.. ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తుంటాయి. దేశంలో ఒక ఎజెండా ఉంటుంది వాటికి.. రాష్ట్రానికి వచ్చేసరికి మరో ఎజెండా ఉంటుంది.. అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.
ఇలా.. ప్రాంతాన్ని బట్టి.. మనుషులను బట్టి.. ఇతరత్రా అవసరాలను బట్టి.. ఎజెండాలను మార్చుకునే పార్టీ కాదు టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక ఎజెండా ఉంటుంది. అది కూడా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే అజెండా. తెలంగాణలో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే పార్టీ.. అంటూ దుబ్బాక ఉపఎన్నికను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అలాగే.. బీజేపీ పార్టీపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తెలంగాణకు రావడం కాదు.. కేంద్రానికే ఈ ఆరేళ్ల కాలంలో సుమారు 2 లక్షలా 72 వేల కోట్లను తెలంగాణ నుంచి పంపించాం. కానీ.. తెలంగాణకు కేంద్రం నుంచి అందింది.. ఈ ఆరేళ్ల కాలంలో లక్ష కోట్లు మాత్రమే.. అంటూ కేటీఆర్ కేంద్రంపై మండిపడ్డారు.
రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా అది మావల్లనే.. అంటారు బీజేపీ నేతలు. రాష్ట్రానికి నిధులన్నీ మేమే ఇచ్చామంటారు. ఎన్నికల్లో పట్టుబడిన పైసలు మాత్రం తమవి కావంటారు.. అంటూ బీజేపీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.