హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్ట టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి స్పల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. రెండో ప్రాధాన్యత ఓట్లలో ఏమైనా జరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రామచంద్రరావుపై 7,626 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
తొలి ఆరు రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,05,710 ఓట్లు పోలయ్యాయి. ఆమె తర్వాత బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 98,084 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 50,450, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, టీడీపీ అభ్యర్థి ఎల్.రమణకు 5,606 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతో విజేతను నిర్ణయించడం కష్టం. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం తప్పనిసరి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అవసరమైతే మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అటు నల్గొండ పరిధిలో ఇప్పటికే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. నల్గొండ పరిధిలో ఏడు రౌండ్లు పూర్తయ్యాక… టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 3,87,969 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636 ఓట్లు చెల్లకపోవడంతో.. 3,66,333 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు పోలయ్యాయి. ఇక ప్రొఫెసర్ కోదండరామ్‌కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588 ఓట్లు పడ్డాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతం పైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారాయి.