తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి అసందర్భ ప్రేలాపన.!

రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుకోవడం అనవసరం. నాయకులు తిట్ల దండకాన్ని అందుకోవడం సర్వసాధారణమైపోయింది. అసందర్భ ప్రేలాపనకైతే ఆకాశమే హద్దు. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆంద్రప్రదేశ్ ప్రస్తావనని అసందర్భంగా తీసుకొచ్చి అభాసుపాలయ్యారు.

కేంద్రాన్ని నిధులకోసం ఆంధ్రప్రదేశ్ అడుక్కుంటోందంటూ తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పైగా, ఆయన అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘అడుక్కుని తినడం’ అనే వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. వివిధ అంశాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా. ఈ క్రమంలోనే తెలంగాణలోని అధికార పార్టీ ఈ రోజు తెలంగాణ వ్యాఫ్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతుల తరఫున నిరసన కార్యక్రమాలంటూ హంగామా చేస్తోన్న విషయం విదితమే.

ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనను తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరుని అసందర్భంగా ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించాల్సి వచ్చింది.

‘ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం.. నిధులు అడుక్కోవడానికి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళుతున్నారని చెప్పగలం.. మరి, మీ ముఖ్యమంత్రి కేసీయార్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీకి వెళుతున్నారు.?’ అంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘మంచిగా వుంటే.. మంచిగా వుంటుంది.. లేదంటే, దేనికైనా సిద్ధమే.. మాటలు అదుపు తప్పితే, వారికి అర్థమయ్యే భాషలోనే బదులిస్తాం..’ అని చెప్పారు పేర్ని నాని.

ఏదిఏమైనా, తెలంగాణలోని అధికార పార్టీ నేతలు సంయమనం కోల్పోవడం… అది కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం.. రెండు తెలుగు రాష్ట్రాలకూ మంచిది కాదు.