భారత్-చైనా ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ రాష్ర్టం సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్లు ఆర్ధిక సహాయం.. నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేసీఆర్ స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో వీరమరణం పొందిన 19 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున రాష్ర్ట ప్రభుత్వం తరుపున అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం సహాయాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందించనున్నట్లు తెలిపారు.
అలాగే సంతోష్ బాబు భార్యకు ఇచ్చే ఉద్యోగానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. సంతోష్ బాబు భారత ఆర్మీలో కల్నల్ స్థాయి లో విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. చిన్న నాటి నుంచి దేశ భక్తే శ్వాసగా భావించిన సంతోష్ బాబు తండ్రి పెంపకం నిజంగా ఎంతో గొప్ప విషయం. తాను దేశానికి సేవ చేసే అదృష్టం దక్కలేదని తన కుమారుడిని సైనికుడిగా తీర్చిదిద్ది భరతమాత రుణం తీర్చుకున్నారు. సంతోష్ బాబు తండ్రి కలనే తన కలగా భావించి ఆర్మీలో చేరి అంచలంచెలుగా కల్నల్ స్థాయికి చేరుకున్నారు.
అలాగే నేడు జరిగిన కేంద్ర స్థాయి అఖిల పక్ష సమావేశంలో కేసీఆర్ తన దైన శైలిలో దేశ భక్తిని చాటుకున్నారు. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు దేశ ప్రజలు అండగా నిలవాలన్నారు. వీర మరణం పొందిన కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలన్నారు. కేంద్ర సహాయానికి రాష్ర్టాల సహాయం కూడా అంతే అవసరమన్నారు. తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, భరోసా కలుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధిక ఇబ్బందులున్నా ఖర్చులు తగ్గించుకుని సైనికుల సంక్షేమానికి పాటుపడాలన్నారు.