ప్రస్తుతం కరోనా పరిస్థితులలో కూడా తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయ భవనాన్ని కూల్చే పనిలో నిమగ్నమయ్యింది. అయితే పాత సచివాలయ భవనం కూల్చివేతల్లో మీడియాను అనుమతించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై కోర్టులో విచారణ జరగగా సెక్షన్ 180ఈ ప్రకారం సైట్‌లో పని చేసేవారు మాత్రమే ఉండాలని అందుకే మీడియాను అనుమతించడం లేదని ప్రభుత్వం చెప్పినా ఆ మాటలను హైకోర్ట్ పట్టించుకోలేదు.
సచివాలయం కూల్చివేత పనులు ఎలా జరుగుతున్నాయో, ఎంత మేరకు పనులు పూర్తయ్యాయో ప్రజలకు చూపించేందుకు మీడియాని అనుమతించాలని లేదంటే తామే అనుమతి ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించింది. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన కేసీఆర్ సర్కార్ మీడియాని అనుమతించేందుకు నిన్న పర్మీషన్ ఇచ్చింది. అయితే కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ, పోలీసులు ఏర్పాటు చేసిన వాహనాలలోనే మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళి కూల్చివేత పనులను షూట్ చేస్తూ ప్రజలకు లైవ్‌లో చూపించారు.
అయితే హైకోర్ట్ మీడియాని అనుమతించమనడం, ప్రభుత్వం కూడా నిబంధనల మధ్య మీడియాని అనుమతించడం బాగానే ఉంది కానీ ఒకే వాహనంలో ఒకరికి ఒకరికి మధ్య కనీస సామాజిక దూరం లేకుండా వారిని లోపలికి తీసుకెళ్ళిన ప్రభుత్వ విధానాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏదో సఫారీ పర్యటనకు వెళ్ళినట్టు మీడియా మిత్రులను కిందకు దిగకుండా ఉండేందుకు ఒకే వాహనంలో తీసుకెళ్ళారని, వారి మధ్య కనీస సామాజిక దూరం ఉండేలా చూసుకోవలసిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కరోనా పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు, ఒకరిద్దరు చనిపోయారు కూడా. అయితే ఇవన్ని తెలిసి కూడా ఇలా నిర్లక్ష్యపు ధోరణి ఎందుకు అవలంభిస్తుందన్న దానిపై ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుకుంటుందో మరీ..!