తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుంది. ఈటెల రాజేందర్‌కి చెందిన జమున హేచరీస్ సంస్థకు సంబంధించి భూముల వివాదం నేపథ్యంలోనే, ఈటెల రాజేందర్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మంత్రి వర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.
ఈటెల రాజేందర్ భూ కబ్జాకి పాల్పడ్డారన్నది అప్పట్లో కేసీయార్ స్వయంగా చేసిన అభియోగం. జమున హేచరీస్ భూములకు సంబంధించి కొందరు ఫిర్యాదు, తదనంతర వ్యవహారాల నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ మీద వేటు వేశారు కేసీయార్.
ఆ తర్వాత కేసీయార్, గులాబీ పార్టీని వీడటం, బీజేపీలో చేరడం తెలిసిన సంగతులే. ఈ భూముల వివాదానికి సంబంధించి ఈటెల రాజేందర్ కోర్టును సైతం ఆశ్రయించారు. అనంతరం, ఈ వివాదం అలా అలా తెరమరుగైపోయింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్, బీజేపీ నుంచి పోటీ చేసి బంపర్ విక్టరీ అందుకున్నాక.. మళ్ళీ ఈటెల భూ దందా వ్యవహారం తెరపైకొచ్చింది. అధికారులు, ఈటెల కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.
అయితే, గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పట్లో ఈటెల రాజేందర్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే.. గులాబీ పార్టీలో నిర్లక్ష్యానికి గురైన నాయకుడు. ఇప్పడాయన బీజేపీ నేత. సో, రాజకీయం రసవత్తరంగా మారబోతోందన్నమాట.