అప్పుడెప్పుడో మార్చిలో మూతపడ్డాయి. మళ్లీ ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. అదేనండి.. బార్లు, క్లబ్బుల గురించే చెప్పేది. తెలంగాణలో శనివారం నుంచి బార్లు, క్లబ్బులు తెరుచుకోబోతున్నాయి. వీటితో పాటు పార్కులు కూడా తెరుచుకుంటాయి.
వీటి రీఓపెన్ కు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. మార్చి 22 నుంచి కరోనా వల్ల ఇవన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో వీటి రీఓపెన్ కు ప్రభుత్వం అనుమతించింది.
అనుమతితో పాటు కొన్ని కండీషన్లను కూడా ప్రభుత్వం పెట్టింది. అంటే… బార్ల యజమానులతో పాటు మందుబాబులు కూడా కొన్ని రూల్స్ ను పాటించాల్సిందే.
క్లబ్బుల్లో అయితే ఈవెంట్లు నిర్వహించడానికి వీలు లేదు. అలాగే డ్యాన్సులకు కూడా పర్మిషన్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి గైడ్ లైన్స్ జారీ చేసిందో.. వాటి ప్రకారమే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బార్లు, క్లబ్బులు నడుచుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
బార్ల వద్ద, క్లబ్బుల వద్ద గేటు ముందే.. లోపలికి వెళ్లడానికి ముందే.. కస్టమర్లకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ఖచ్చితంగా బార్ లో సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెన్ చేయాలి. క్యూ పద్ధతిని పాటించాలి. ఖచ్చితంగా కస్టమర్లు అయినా.. సిబ్బంది అయినా మాస్కులు, శానిటైజర్ ఉపయోగించాలి. బార్ లో ప్రతి టేబుల్ మీద శానిటైజర్ ఉండాలి. కస్టమర్లు గుంపులు గుంపులుగా రావడం.. ఒకరిని మరొకరు తాకడం, ఒకరి వస్తువులు మరొకరు వాడటం లాంటివి బార్లలో నిషిద్ధం.
బార్లలో మాత్రమే కస్టమర్లకు ప్రభుత్వం అనుమతించింది. సాధారణంగా వైన్ షాపుల వద్ద ఉండే పర్మిట్ రూంలకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అవి ఎప్పటిలాగే మూసే ఉంటాయి.