మొదటి మ్యాచ్ పాకిస్తాన్ చేతిలో ఓడి, రెండో మ్యాచ్ న్యూజిలాండ్‌కి సమర్పించేసుకున్న టీమిండియా, టీ20 వరల్డ్ కప్ పోటీల్లో అత్యంత పేలవమైన రీతిలో ఎంట్రీ ఇచ్చి, ఇంటికి దారి వెతుక్కుంది. ఆట అన్నాక గెలుపోటములు సహజం.. అనే మాట ఇలాంటి సందర్భాల్లో వాడటం సబబు కాదేమో.
ఎందుకంటే, ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి టీమిండియా ఏనాడూ పాకిస్తాన్ చేతిలో పరాజయం పొందలేదు. అంతటి ఘనమైన రికార్డుని కోహ్లీ సేన తన స్వహస్తాలతో చెరిపేసుకుంది. పాకిస్తాన్ మీద ఓడితే ఓడారు, న్యూజిలాండ్ మీద గెలవాలి కదా.? అక్కడా సేమ్ టు సేమ్ చెత్త ప్రదర్శన.
రెండు మ్యాచ్‌లలో ఓడితే, టీమిండియాని దారుణంగా తిట్టాలా.? అంటే, తిట్టడం కాదిక్కడ.. కోట్లాదిమంది భారత క్రికెట్ అభిమానుల ఆవేదన ఇది. 130 కోట్ల మంది భారతీయుల ఆశల్ని మైదానంలో 11 మంది ఆటగాళ్ళు మోసారు. టీమిండియా ఓటమి.. అంటే, 130 కోట్ల మంది భారతీయుల ఓటమిగా మారిపోయింది.. ఎందుకంటే, అక్కడ ప్రత్యర్థఇ పాకిస్తాన్ గనుక.
జట్టు కూర్పు దగ్గర్నుంచి, ఆటగాళ్ళ ప్రదర్శన వరకు.. ఏదీ బాగా లేదు. చిన్న జట్ల మీద మాత్రం చెలరేగిపోతున్నారు భారత ఆటగాళ్ళు. ఈ విజయాల్ని ఆస్వాదించే పరిస్థితుల్లో భారత క్రికెట్ అభిమానులు లేరు. గత కొంతకాలంగా టీమిండియా మంచి క్రికెట్ ఆడుతోంది. అదే సమయంలో తరచూ అతి చెత్త ఆటతీరుని కూడా ప్రదర్శిస్తోంది.
కెప్టెన్ కెహ్లీ, టీ20 వరల్డ్ కప్ పోటీల తర్వాత వన్డే, టీ20 పోటీలకు కెప్టెన్‌గా కొనసాగబోనని ముందే ప్రకటించడం పెద్ద తప్పిదంగానే చెప్పుకోవాలేమో. అదొక్కటే కాదు, చాలా తప్పిదాలు జరిగాయి. సరిదిద్దుకోలేని తప్పిదాలవి. వాటన్నిటికీ మూల్యం గట్టిగానే చెల్లించుకుంది టీమిండియా. కప్పు కొట్టుకొస్తారనుకుంటే, ఉత్త చేతుల్తో.. చెత్త రికార్డుని టీమిండియా వెంటబెట్టుకుని వస్తోంది.. పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన ఫలితమిది.