విజ‌య‌గ‌ర్వంతో సొంత గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త్.. ల‌భించిన ఘ‌న స్వాగ‌తం

హీరోలు లేదా క్రికెటర్స్‌ని అభిమానులు నెత్తిమీద పెట్టుకుంటారు. వారు మంచి విజ‌యాలు సాధిస్తే ఆకాశానికి ఎత్తుతున్నారు. తేడా వ‌చ్చిందంటే తాట తీస్తారు. తాజాగా గాబా గ‌డ్డ‌పై విజ‌య‌దుందుభి మోగించి సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియాకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నుండి చిన్నా చిత‌కా క్రికెట‌ర్స్‌తో పాటు అభిమానుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా కురిసాయి. స్టార్స్ లేకుండా గ‌బ్బా పిచ్‌పై అద్భుతంగా ఆడి సిరీస్ ద‌క్కించుకున్నంద‌కు ప్ర‌తి ఒక్క‌రు వారి పోరాట ప‌టిమను ప్ర‌శంసిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. గాబా పిచ్‌లో ఓటమంటే ఎరుగని కంగారూలకు గెలుపంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది.


ముఖ్యంగా నాలుగో టెస్ట్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్, శార్ధూల్ ఠాకూర్, శుభ్‌మ‌న్ గిల్‌, పుజారా,రిషబ్ పంత్ అద్భుతంగా ఆడ‌డంతో బ్రిస్బేన్ టెస్ట్ లో భార‌త్ అద్భుత విజ‌యం సాధించింది. న‌రాలు తెగే ఉత్కంఠ‌ని క్రియేట్ చేసిన నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్ర‌తి ఒక్క‌రికి మ‌స్త్ మ‌జాని అందించింది. చాలా రోజుల త‌ర్వాత ఇలాంటి కిక్ అందించిన భార‌త ఆట‌గాళ్ళ‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు ఇంకా కురుస్తూనే ఉంది. అయితే ఆస్ట్రేలియా టూర్‌ను ఘ‌నంగా ముగించిన ఇండియ‌న్ టీమ్ తాజాగా సొంత గ‌డ్డ‌పై అడుగుపెట్టింది.

గురువారం ఉద‌యం భార‌త ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రు సొంత గ‌డ్డ‌పై అడుగుపెట్టిన నేప‌థ్యంలో వారికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. కెప్టెన్ అజింక్య ర‌హానే, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ ర‌విశాస్త్రి, ఓపెన‌ర్ పృథ్వి షా ముంబైకి చేరుకున్నారు. బ్రిస్బేన్ టెస్ట్ హీరో రిష‌బ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు.మీడియాతో మాట్లాడిన ఆయ‌న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ద‌క్కినందుకు సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నాడు. టీం ప‌ర్‌ఫార్మెన్స్ సంతృప్తి క‌లిగించింద‌ని పేర్కొన్నాడు పంత్‌. మ‌రి కొద్ది రోజుల‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లు ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.