రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఊపిరి బిగపట్టే ఉత్కంఠను అందించింది. భారత జట్టు భారీ స్కోర్ సాధించినప్పటికీ, చివరి ఓవర్ల వరకు రెండు జట్లకు విజయం ఖాయం అనిపించని పరిస్థితి నెలకొంది. చివరికి 17 పరుగుల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. అంత వరకు సౌతాఫ్రికా బ్యాటర్లు చూపించిన పోరాట పటిమ స్టేడియాన్ని నిశ్శబ్దంలో ముంచేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు టాప్ గేర్ లో ఆడటంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి భారత్ 349 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ లక్ష్యంతో గెలుపు భారత్ ఖాయమనిపించింది.
350 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా గట్టి షాక్ తింది. కేవలం 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పూర్తిగా కష్టాల్లో పడింది. అక్కడితో మ్యాచ్ ముగిసినట్టే అనుకున్నారు. కానీ అక్కడే అసలు డ్రామా మొదలైంది. బ్రిట్జ్ కీ, జాన్ సెన్ జట్టు ఇన్నింగ్స్‌ను మళ్లీ నిలబెట్టారు. క్రీజ్‌పై నిలబడి ధైర్యంగా పరుగులు రాబట్టారు.
ఆ తర్వాత బాష్, బ్రెవిస్ వేగంగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. స్టేడియంలో ఒక్కసారిగా మ్యాచ్ తిరగబడిన భావన కనిపించింది. చివరి ఓవర్లలో విజయం ఎవరిదో చెప్పలేని స్థితి నెలకొంది. అయినప్పటికీ భారత బౌలర్లు తుదిలో పట్టుదలతో బంతులు విసిరారు.
ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మరోసారి తన మంత్రం చూపించాడు. కీలక నాలుగు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. హర్షిత్ రానా మూడు వికెట్లతో మెరిసి కీలక బ్రేక్‌లు అందించాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా రెండు వికెట్లు తీసి ఒత్తిడి మరింత పెంచాడు. చివరికి 332 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆలౌట్ అయి, భారత్ 17 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.
