టీచర్ల పోరు, తప్పు ప్రభుత్వానిదా.? నిజమెంత.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల లొల్లి మళ్ళీ తెరపైకొచ్చింది. తమను ప్రభుత్వం వేధిస్తోందని ఉపాధ్యాయులు గుస్సా అవుతున్నారు. బయో మెట్రిక్, ఫేస్ రీడింగ్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు స్కూళ్ళకు హాజరయ్యే విషయాన్ని ప్రభుత్వం ధృవీకరించేందుకు కొత్త ఏర్పాట్లు చేసిన విషయం విదితమే.

అయితే, ఈ యాప్ ద్వారా తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆ యాప్ ద్వారా తమ వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతుందన్నది కొందరు ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఈ రోజుల్లో యాప్స్ ఏవైనాగానీ, ఆయా మొబైల్ ఫోన్లలోని లొకేషన్ సహా అన్నిటికి సంబంధించిన యాక్సెస్ అడుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం.

ఎంటర్టైన్మెంట్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని టైమ్ పాస్ చేస్తున్నవారికి, ప్రభుత్వం అధికారిక ఆదేశాలతో ‘యాప్’ వినియోగించాలని కోరితే వచ్చే చిక్కేంటి.? అన్నది కీలకమైన విషయమిక్కడ. ‘మాకంటూ ప్రత్యేకంగా డివైజెస్ ఇస్తే, వాటి ద్వారా ప్రభుత్వం చెప్పినట్లు వ్యవహరించడానికి మాకెలాంటి ఇబ్బందీ లేదు..’ అని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు సంబంధించి డివైజెస్ ఇవ్వాలనుకుంటే, అదేమీ పెద్ద కష్టమైన వ్యవహారం కాదు. సాంకేతికతను పుణికిపుచ్చుకునే క్రమంలో, స్కూళ్ళలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే.. అసలంటూ సమస్యే వుండదు.

గత కొంతకాలంగా ప్రభుత్వానికీ, ఉపాధ్యాయులకీ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయుల్ని కించపర్చేలా ప్రభుత్వంలో వున్న కొందరు నేతలు రాజకీయ ఆరోపణలు చేస్తోంటే, ఉపాధ్యాయుల్లో కొందరు తమ స్థాయి మర్చి, ప్రభుత్వంలో కీలక పదవుల్లో వున్నవారిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం.

ఈ ఆధిపత్య పోరులో భాగంగా, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. అంతిమంగా నష్టపోతున్నది మాత్రం విద్యార్థులే.