టీడీపీ నుంచి వలసలు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తేదాపా నుంచి వైకాపాలోకి జంప్ అవుతోన్న కొంత మంది పేర్లు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు సహా పార్టీ సీనియర్ నేతలు సైకిల్ దిగి ప్యాన్ కిందకు చేరుతున్నట్లు వినిపించింది. తాజాగా ప్రక్రియ మొదలైనట్లే కనిపిస్తోంది. దీనిలో భాగంగా తొలి వికెట్ సీనియర్ అవ్వడం విశేషం. వివరాల్లోకి వెళ్తే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైకాపా కండువా కప్పబోతున్నారు.
రేపు సాయంత్రం తను అనుచరణ గణం, కుమారుడితో కలిసి జగన్ సమక్షంలో ఆయన వైకాపా తీర్ధం పుచ్చుకోనున్నారు. శిద్ధా పార్టీ మారడంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కీలక పాత్రం పోషించి మార్గం సుగమం చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. శిద్ధా అత్యంత సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకొన్ని గంటల్లోనే రానుంది. స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో శిద్ధా వైకాపాలో చేరుతున్నట్లు ప్రచారం సాగింది. కానీ అప్పుడు సాధ్యం కాకపోవడంతో బుధవారం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
1999లో టీడీపీలో చేరిన శిద్దా పలు శాఖల్లో పనిచేసారు. 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా, 2007 లో టీడీపీ తరుపు ఎమ్మెల్సీగా పనిచేసారు. 2014 అదే పార్టీ నుంచి దర్శి నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపోందారు. చంద్రబాబు కేబినేట్ లో మంత్రిగా పనిచేసారు. టీడీపీతో దాదాపు 21 సంవత్సరాల అనుబంధం ఉంది. ఇప్పుడా బంధాన్ని తెంచేసుకుని వైకాలో చేరుతుండటం విశేషం. ఆయన ఎంట్రీ ఖరారు కాగానే టీడీపీ నుంచి ఇంకొంత మంది సీనియర్లు వైకాపా కండువా కప్పుకోనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చకొస్తుంది.