టీడీపీ సర్వేలో జనసేన పార్టీకే ఎక్కువ సీట్లు అట.!

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయమై ఆయా రాజకీయ పార్టీలు సొంతంగా పలు సర్వేలు చేయించుకుంటున్న విషయం విదితమే. పార్టీల పరంగా చేయించుకుంటున్న సర్వేలతోపాటుగా, సర్వేలపై ఆసక్తితో పలువురు రాజకీయ ప్రముఖులు లక్షలు వెచ్చించి మరీ సొంతంగా సర్వేలు చేయిస్తున్నారు.

సర్వేలు చేయించుకునేవాళ్ళు ఎక్కువైపోవడంతో, సర్వేలు చేసే సంస్థలూ కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నాయ్. వీటికి విశ్వసనీయతతో పని లేదు. గత కొద్ది నెలలుగా ఈ సర్వేల మీద కోట్లు గుమ్మరించేస్తున్నారు. అలా బోల్డంతమందికి ఉపాధి కూడా లభిస్తోంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు, నాయకుల జేబులకు చిల్లులు పడుతున్నాయ్.!

అసలు సర్వేల ఉద్దేశ్యమేంటి.? అంటూ, ‘మూడ్’ తెలుసుకోవడం. ఓటరు నాడి పట్టుకోవడానికి రాజకీయ పార్టీలు సర్వేల్ని ఆశ్రయిస్తాయి. ఎక్కడ లోపాలున్నాయో సరిదిద్దుకోవడానికి అవకాశం కలుగుతుంది రాజకీయ పార్టీలకి. కానీ, ఇప్పుడు సర్వేలు జరుగుతున్న తీరు వేరు. అవి తప్పుడు ఫలితాల్ని ఇస్తున్నాయ్ రాజకీయ పార్టీలకి. దాంతో, రాజకీయ పార్టీలు నిండా మునుగుతున్నాయ్.

మొత్తంగా అన్ని సీట్లూ మనవే.. అని వైసీపీ అంటోంది. ఈ అతి విశ్వాసం వైసీపీ కొంప ముంచే అవకాశాల్లేకపోలేదు. మరోపక్క, టీడీపీ అయితే జనసేన ప్లస్ బీజేపీ.. ఈ రెండిటినీ కలుపుకుని అధికార పీఠమెక్కేస్తామంటోంది. ట్విస్ట్ ఏంటంటే, టీడీపీ చేయించిన ఓ సర్వేలో జనసేన పార్టీకి.. టీడీపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందట. ఈ విషయమై మీడియాకి టీడీపీ నేతలే కొందరు లీకులు అందించారట కూడా.

సదరు సర్వే ప్రకారం చూస్తే, జనసేనకు 70 సీట్ల వరకూ రావొచ్చునట. వైసీపీకి 60 వరకూ సీట్లు వస్తాయని ఆ సర్వే చెబుతోందట. మిగతా సీట్లలోనూ పూర్తిగా అన్నీ టీడీపీకి వచ్చే అవకాశం లేదట. ఇదెక్కడి వింత.? అని తెలుగు తమ్ముళ్ళే ఆశ్చర్యపోతున్నారు. వైసీపీకి ఎక్కువ సీట్లను పేర్కొనడం ఇష్టం లేక.. అందులో కొంత కోత వేసి, మిత్రపక్షంలా భావిస్తున్న జనసేనకు జోడించారనేది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన. టీడీపీ రాజకీయంగా ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.