సాగర్లో హీరోయిజం అంటే చంద్రబాబుదే అనుకోవాలి !

Nara Chandrababu Naidu is infuriated

గెలుస్తామని తెలిసి పోటీచేయడం ఒక ఎత్తు, ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులే అని తెలిసి గెలవడం కోసం పాటుపడటం మరొక ఎత్తు.  ఈ రెండూ కాకుండా అసలు గెలవలేమని, పోటీ చేసినా ప్రయోజనం ఉండదని, భవిష్యత్తు సైతం లేదని తెలిసి కూడ పోటీకి దిగడం అంటే ఏమనాలి ? మామూలు భాషలో అయితే కోరికోరి పరువు పోగొట్టుకోవడం  అంటారు.  కానీ చంద్రబాబు నాయుడుగారి భాషలో మాత్రం అదే హీరోయిజం.  ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీడీపీ చూపిస్తున్నది ఆ తరహా హీరోయిజమే.  ఈ ఉపఎన్నికలను కాంగ్రెస్, తెరాస, భాజపాలు చాలా తీవ్రంగా తీసుకుని పనిచేస్తున్నాయి.  కాంగ్రెస్ తరపున జానారెడ్డి పోటీ ఖాయమైపోయింది.  భారీ మెజారిటీతో గెలిచి తన గత రికార్డులను తానె బద్దలు కొట్టుకుంటానని అంటున్నారు ఆయన. 

ఇక తెరాస, భారతీయ జనతా పార్టీలు బలమైన అభ్యర్థుల కోసం  వెతుకుతున్నాయి.  రేపో మాపో పేర్లను ప్రకటిస్తారు.  ఎన్నికల కోసం ఎవరి వ్యూహాలను వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు.  ప్రస్తుత అంచనాలు మేరకు ఇక్కడ పోటీ తెరాస వెర్సెస్ కాంగ్రెస్ అన్నట్టే ఉంటుంది తప్ప మూడవ పార్టీకి అవకాశం లేదని, తారాజువ్వలా ఎగసిపడుతున్న బీజేపీకి సైతం ఇక్కడ అంత సీన్ లేదని విశ్లేషకులు చెబుతున్నారు.  బీజేపీ దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో సత్తా చాటినా ఇక్కడ మాత్రం ప్రభావం చూపలేదని చెబుతున్నారు.  ఇలాంటి క్లిష్టమైన పోటీలో మేమూ నిలబడతామంటూ టీడీపీ వచ్చి చేరింది.  అభ్యర్థిగా మువ్వా  అరుణ్ కుమార్ పేరును ఖాయం చేశారు చంద్రబాబు. 

Chandrababu Naidu

పోటీలో దిగితే ఏదైనా ప్రయోజనం ఉంటుంది అంటే దిగవచ్చు.  కానీ టీడీపీ పోటీ చేయడం ఆ పార్టీకి లాభం కాదు కదా పక్క పార్టీలకు డ్యామేజ్ కూడ చేయలేదని, ఉండటానికి నియోజకవర్గం ఆంధ్రా సరిహద్దుల్లోని ఉన్నప్పటికీ పసుపు జెండా ప్రభావం కనిపించదని తేల్చేస్తున్నారు.  ఈ లెక్కలనీ తెలిసి కూడ పోటీలో   అభ్యర్థిని నిలబెట్టడం చూస్తే నామ్ కె వాస్తే మేమూ ఉన్నామని, మా పార్టీ అనేది ఒకటి ఉందని చెప్పుకోవడానికి, గెలుపు అవకాశాలు లేకున్నా ధైర్యంగా   పోటీలో నిలిచిన సాహసవంతులమని చెప్పుకోవడాని అన్నట్టే ఉంది.