రాజ్యసభ సభ్యుడు, ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం నిన్న సాయంత్రమే మీడియాకు లీక్ అవ్వడంతో..విజయసాయి కూడా ఆ ప్రచారాన్ని ధృవీకరించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు న్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం నేతలు విజయసాయిని ఉద్దేశించి సంచలన ట్వీట్లు పెడుతున్నారు. దీనిలో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ట్విటర్ వేదికగా మండిపడ్డారు. బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని ఘోరంగా అవమనించారని అయ్యన్న అన్నారు.
ఆరోగ్యంగా గుండ్రాయిలా? ఉన్న డ్రామాలేంటి అచ్చెన్న అని ఆయనని అగౌరవపరిచారని మండిపడ్డారు. అచ్చెన్నకు కార్పోరేట్ ఆసుపత్రి కావాలా? ఈ ఎస్ ఐ వద్దా ? అంటూ నాడు అచ్చెన్నను విజయసాయి ఎద్దేవా చేసారని గుర్తు చేసారు. మరి ఇప్పుడు విజయసాయికి కరోనా వచ్చింది. రాగానే ప్రత్యేక విమానంలో విశాఖపట్ణణం నుంచి హైదరాబాద్ కి ఎందుకు పారిపోయారు? వైకాపా నాయకులకి హైద్రాబాద్ లో కార్పోరేట్ వైద్యమా? ప‌్రజలకేమో పులిహోర ప్యాకెట్ల వైద్యమా? గుండ్రాయిలా ఉన్న సాయిరెడ్డి విశాఖ కేజీహెచ్ లో ఎందుకు చేరలేదు. ఏపీలో అల్లుడి వైద్యం మీద విజయసాయికి నమ్మకం లేదని ఎద్దేవా చేసారు అయ్యన్న పాత్రుడు.
ఏపీలో కరోనా వైద్యం మొదట్లో బాగుందని, ప్రభుత్వ సేవలు బాగున్నాయని ప్రజలు మెచ్చారు. కానీ ఇప్పుడు కరోనాని ఏపీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరహాలో గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని, రోగులను పట్టించుకోవడం లేదని విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. కట్టడి విషయంలో అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని, పేషెంట్లు ఉన్న ప్రాంతాల్లో పోలీసుల గస్తీ కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. మరి వీటికి ప్రభుత్వం ఎలా పుల్ స్టాప్ పెడుతుంది? అయ్యన్న వ్యాఖ్యలపై కరోనా తగ్గిన తర్వాత విజయసాయి ఎలా బధులిస్తారు? అన్నది చూడాలి.