టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గురించి రాయాలంటే ఒక్క రోజు సరిపోదు. ఆయనది పెద్ద చరిత్ర. దశాబ్దాల రాజకీయ అనుభవం. ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారో లోకమంతా తెలుసు. దాని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
కాకపోతే.. ఆయన ఏం చేసినా దానికి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ తోనే ముందుకెళ్తారు. పెద్ద పెద్ద మహామహులను చూసి కూడా బెదరని పర్సనాలిటీ చంద్రబాబుది. తన కళ్ల ముందు ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులను చూశారు. రాజకీయాల్లో ఆరితేరిన మనిషి.
ఇన్ని తెలిసి కూడా చంద్రబాబు అప్పుడప్పుడు అడ్డంగా దొరికిపోతుంటారు. అధికార పార్టీకి దొరికిపోయి అబాసుపాలు అవుతుంటారు. ఆ విషయం లేటుగా తెలుసుకొని అప్పుడు ఏదో చేద్దామనుకుంటున్నారు.
ఎందుకంటే.. కరోనా రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాష్ట్రానికి వచ్చింది లేదు.. ప్రజలను కలిసింది లేదు. లాక్ డౌన్ నుంచి హైదరాబాద్ లోనే మకాం. ఏదైనా మీటింగ్ ఉంటే వీడియో కాన్ఫరెన్స్. టీడీపీ తమ్ముళ్లతోనూ వీడియో కాల్ లో మాట్లాడటమే. అన్నీ వర్చువల్ సమావేశాలే. ఇదే వైసీపీ నేతలకు దొరికింది.
ఏం చంద్రబాబు. కరోనా వచ్చి రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉన్నా కూడా నీకు రాష్ట్రానికి రావాలనిపించడం లేదా? హైదరాబాద్ లో ఉండి చోద్యం చూస్తున్నావా? అంటూ వైసీపీ నేతలు చంద్రబాబుపై ఆరోపణలు చేసినా హైదరాబాద్ ను మాత్రం వీడలేదు.
మధ్యలో ఒక్కసారో రెండుసార్లో విజయవాడుకు వచ్చి ఉంటారు అంతే. కరోనా సమయంలోనే అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరుకున్న సమయంలో పార్టీ కార్యాలయం నుంచే పాల్గొన్న చంద్రబాబు.. కొల్లు రవీంద్ర అరెస్ట్ సమయంలో విజయవాడలో ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి ఇప్పటి వరకు అమరావతికి వచ్చింది. ఏది ఉన్నా హైదరాబాద్ నుంచే. మీడియా సమావేశాలు కూడా అక్కడి నుంచే.
ఇలాగే ఇక్కడే ఉంటే వైసీపీకి ఇంకా దొరికిపోతాం.. అని అనుకున్నారో ఏమో.. ఇక చంద్రబాబు కదనరంగంలోకి దిగారు. వర్చువల్ సమావేశాలకు చెక్ పెట్టి విజయవాడకు పయనమవుతున్నారు. ఇంకా హైదరాబాద్ లోనే ఉంటే ప్రజలు మరోసారి రాష్ట్రానికి రానిస్తారో? రానివ్వరో? అని విజయవాడకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూద్దాం.. విజయవాడకు వచ్చిన తర్వాత ఏం చేస్తారో?