మీడియా అనేది ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తునే ఉంటుంది అనేది గతంలో గొప్పగా చెప్పుకునే మాటలు, ఇప్పుడు మాత్రం మీడియా అనేది రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారిపోయాయి. ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి మరి శృతిమించి పోతుంది. ప్రధాన ఛానెల్స్ కావచ్చు, పత్రికలూ కావచ్చు ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనే విషయం అందరికి తెలిసిందే.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈటీవీ, ఏబీఎన్, సాక్షి టీవీ, టీవీ5 …తదితర పత్రికలు, చానళ్లు పార్టీల కండువాల కప్పుకుని, రంగులేసుకుని మరీ వార్తల ప్రచురణ, ప్రసారం చేస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఇందులో ఏబీఎన్,టీవీ5 చానెల్స్ విషయంలో అధికార వైసీపీ పార్టీ ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందే వైసీపీ పార్టీ ఆ రెండు చానెల్స్ ను బహిష్కరించి, తమ ప్రతినిధులెవరు ఆయా చానెల్స్ కు వెళ్ళటానికి వీలులేదని నిర్ణయం తీసుకుంది.
తాజాగా అదే బాటలో టీడీపీ కూడా చేరింది. ప్రముఖ చానెల్స్ అయిన టీవీ 9, NTV చానెల్స్ కు తమ ప్రతినిధులు ఎవరు వెళ్ళటానికి వీలులేదని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా Prime 9 news చానల్‌ను టీడీపీ బహిష్కరించడం గమనార్హం. గత వారం పది రోజుల నుండి టీడీపీ నేతలెవరూ ఆయా చానెల్స్ కు వెళ్లటం లేదు. గతంలో మీడియా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పచ్చ పార్టీ నేతలు ఇప్పుడెందుకు మూడు చానెల్స్ బహిష్కరించారో చెప్పాలి.
నిజానికి టీడీపీ బ్యాన్ చేసిన టీవీ 9, NTV లు తెలుగుదేశానికి వ్యతిరేకంగా పెద్దగా న్యూస్ ప్రచారం చేయటం లేదు. అలాగని అనుకూలమైన వార్తలు కూడా ఇవ్వటం లేదు. అక్కడ యాంకర్స్ ను బట్టి అనుకూలమా, వ్యతిరేకమా అన్నట్లు డిబేట్స్ నడుస్తున్నాయి తప్ప, టార్గెట్ చేసినట్లు ఏమి కనిపించవు, కానీ టీడీపీ మాత్రం వాటిని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు మీడియా వర్గాల్లో సంచలనంగా మారిపోయింది.