తెలుగుదేశం పార్టీ సమస్యల వలయంలో చిక్కుకుంది. రోజు రోజుకూ కొత్త కొత్త సమస్యలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా పార్టీ కీలక నేతలు వ్యవహరిస్తున్న తీరు అనేక సమస్యలకు కారణమవుతోంది. కొందరు నేతలు బహిరంగంగానే బయటికొచ్చి వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తూ చంద్రబాబును తీవ్రంగా తప్పుబడుతున్నారు. పార్టీలోనే ఉంటూ శత్రువుల్లా వ్యవహరిస్తున్న వీరి తీరుతో బాబు చాలానే ఇబ్బందులు పడుతున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు ఈ కోవలోని ఎమ్మెల్యేలే. ఇక గంటా శ్రీనివాసరావు అయితే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా వైసీపీలో దూరిపోదామా లేకుంటే బీజేపీ గూటికి చేరదామా అనే పనుల్లో ఉన్నారు. ఇక ఇంకో వర్గం అయితే ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు.
పాలకవర్గాన్ని ఢీకొట్టే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో కలిసి రావడంలేదు. అలాంటి ఒక ఎమ్మెల్యేనే పయ్యావుల కేశవ్. 2019 ఎన్నికల ముందు కేశవ్ పార్టీలో విపరీతమైన చురుకుగా ఉండేవారు. మొదటి నుండి అలానే వ్యవహరించేవారు. టీడీపీ ఓడిపోయిన 2004, 2009 ఎన్నికల్లో ఉరవకొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన అయన అప్పటి పాలకవర్గాల మీద పోరాడటంలో చంద్రబాబుకు అన్ని విధాలా తోడుగా ఉండేవారు. పార్టీలో బాబు తర్వాత అంత గట్టిగా వినిపించే గొంతుక ఆయనదే అనేవారు చాలామంది. అందుకే బాబుకి కేశవ్ అంటే ఎంతో నమ్మకం. అందుకే 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచి ఆయన ఓడితే బాబు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి ప్రముఖంగా నిలబెట్గారు.
ఇక గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడినా కేశవ్ మాత్రం గెలుపొందారు. దాంతో బాబు ఆయన మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. సీమ ప్రాంతం నుండి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు కాబట్టి జగన్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడతారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎందుకో కానీ కేశవ్ ఉన్మట్టుండి సైలెంట్ అయిపోయారు. గతంలో చిన్న చిన్న విషయాల మీద కూడ స్పందించిన ఆయన ఇప్పుడు కీలక నేతలు అచ్చెన్నాయుడు, జేసీ, కొల్లు రవీంద్రలు అరెస్టు కాబడినా నోరు మెదపలేదు. మీడియా ముందుకు అస్సలు రావట్లేదు. కొందరైతే అసలు అయన టీడీపీలోనే ఉన్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన మౌనానికి కారణం ఏమిటయా అంటే వైఎస్ జగన్ దూకుడే అనే సమాధానం వినిపిస్తోంది. బాబు సైతం ఆపద సమయంలో అక్కరకు రావలసిన కేశవ్ మౌనం వహించడం పట్ల అసంతృప్తిగా ఉన్నారట.