ఏంటో.. ఈ అసెంబ్లీ సమావేశాలు.. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సమావేశాలు మొదలైనప్పటి నుంచి మూడో రోజు ఇవాళ కూడా గొడవలే. మొదటి రోజు స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. చంద్రబాబు కూడా సస్పెండ్ అయ్యారు. ఎన్నడూ లేనంత విచిత్రంగా చంద్రబాబు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించడంతో వైసీపీ సభ్యులందరూ కంగుతిన్నారు.
నిన్న కూడా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
పోనీ.. ఈరోజయినా సభ ప్రశాంతంగా జరుగుతుందా అంటే.. సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
సభ ప్రారంభం కాగానే.. విద్యుత్ సవరణ బిల్లుపై, అసైన్డ్ లాండ్స్ లీజు అంశంపై చర్చ నిర్వహించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అలాగే వీటిపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను టీడీపీ సభ్యులు కోరారు. అయితే.. స్పీకర్.. చంద్రబాబుకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.