AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమలుపరిచిన నిర్ణయాలు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి మైనస్ గా మారిన అంశం ఏదైనా ఉంది అంటే అది భూముల రిజిస్ట్రేషన్ అనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్లను ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ విధానం ప్రజల భూములను కొల్లగొట్టేందుకు రూపొందించినదని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
ఇక ఇదే విషయాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వ్యతిరేకతను కూడా క్రియేట్ చేశారని తెలుస్తోంది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని స్వీకరిస్తూ, గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఈ మార్పు గతంలో చేసిన విమర్శలు రాజకీయ ఎత్తుగడల కోసమేనని స్పష్టం అవుతుంది.
గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాల భూమి రిజిస్ట్రేషన్లను సచివాలయాల్లో చేపట్టాలని నిర్ణయించగా, కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని సవరించింది.కేవలం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లను మాత్రమే సచివాలయాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రజలకు సేవలను సులభతరం చేయడంతోపాటు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పాలి. ఇలా భూముల రిజిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
