AP: ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది అయితే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి గతంలో రైతుల నుంచి సుమారు 30వేల ఎకరాల వరకు భూములను సేకరించి రాజధాని అభివృద్ధి కోసం కృషి చేశారు. అయితే 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో జగన్ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీంతో అమరావతి అభివృద్ధి అక్కడితో ఆగిపోయింది. ఇక ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం గత ఎన్నికలలో ఓటమిపాలు కావడానికి మూడు రాజధానుల అంశం కూడా ఒకటి అని చెప్పాలి.
ఇలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావడంతో రాజధాని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి అమరావతి అభివృద్ధి చెందుతుందని, అంతర్జాతీయ స్థాయిలో ఈ నగరాన్ని చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతారు అంటూ అందరూ భావించారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతి అభివృద్ధి పనులు పక్కనపెట్టి మరో 30 వేల ఎకరాల భూముల సేకరణ చేపట్టారు. దీంతో సొంత నేతలలోనే కాస్త నిరుత్సాహం ఎదురైందని తెలుస్తోంది.
బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని తీర్చిదిద్దుతారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం తిరిగి మరోసారి భూముల సేకరణ చేస్తున్న నేపథ్యంలో గతంలో రైతులు అప్పగించిన భూములపై అభివృద్ధి జరగకపోవడం వల్ల ప్రజలలో నమ్మకం సడలింది. కొత్త భూ సమీకరణ ప్రజలను మరింత అసంతృప్తికి గురిచేస్తుందని నేతలు ఆందోళన చెందుతున్నారు ఇదే విషయాన్ని వైసిపి నేతలు తమకు అనుగుణంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
గతంలో రైతులకు ఇచ్చిన హామీలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి నెరవేరకపోవడం వల్ల ప్రజలలో విశ్వాసం క్షీణించింది. ఈ నేపథ్యంలో, కొత్త భూమి సేకరణకు ముందు గత హామీలను నెరవేర్చడం కీలకమని నేతలు సూచిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించడానికి పారదర్శకత, సమర్థవంతమైన అమలు, ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలపై దృష్టి పెట్టాలి. లేకపోతే తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారం చేజికించుకోవడం ఖాయమని సొంతనేతలే ఆందోళనలు చెందుతున్నారు.
