తెలుగు రాజకీయాల్లో జనసేన చేస్తున్న రాజకీయాలు ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఒంటరిగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతానని, నూతన రాజకీయాలను ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో కలిసి ఏ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారో అర్ధం కావడం లేదు. బీజేపీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు ఎంత మోసం చెయ్యాలో అంత మోసం చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ప్రత్యేక హోదాను బీజేపీ గంగలో ముంచింది. అలాగే ఇప్పుడు అమరావతి విషయంలో కూడా బీజేపీ పక్కకు తప్పుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. బీజేపీ ఏపీ ప్రజలతో ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటున్నా కూడా పవన్ పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై ఇప్పుడు పవన్ పై టీడీపీ నాయకులు కోపంగా ఉన్నారు.
జనసేనపై కోపంగా ఉన్న టీడీపీ నేతలు
2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి ముఖ్య కారణాల్లో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమానులందరు టీడీపీకి మద్దతుగా నిలిచి చంద్రబాబుకు విజయాన్ని అందించారు. టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల 2019 ఎన్నికల నాటికి జనసేన టీడీపీకి దూరంగా ఉంది. కానీ టీడీపీ మాత్రం పవన్ ను దూరంగా పెట్టుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో పవన్ పై వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు టీడీపీ నాయకులు చెయ్యలేదు. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు జనసేనపై కోపంగా ఉన్నారు. ఎందుకంటే అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం చెప్పకపోవడం వల్ల టీడీపీ నేతలు పవన్ పై కోపంగా ఉన్నారు. బీజేపీతో కలిసి ఉండటం వల్లే అమరావతి విషయంలో పవన్ స్పందించడం లేదని, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నా కూడా పవన్ ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహంగా ఉన్నారు.
బీజేపీని పవన్ దూరం పెట్టారా!!
ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు చోట్లలలో ఓడిపోయినప్పటికి పవన్ కళ్యాణ్ లో ఉన్న దూకుడుతనం మాత్రం తగ్గలేదు. కానీ ఎప్పుడైతే జనసేన బీజేపీతో కలిసిందో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ లో ఉన్న దూకుడు తనం, ప్రశ్నించే విధానం తగ్గింది. స్పందిస్తే బీజేపీ ఏమంటుందోననే భయంతో పవన్ చాలా సైలెంట్ ఉన్నారు. అయితే ఏపీ విషయంలో బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని చూస్తూ పవన్ బీజేపీతో కలిసి ఉండలేకపోతున్నారని సమాచారం. బీజేపీకి దూరంగా ఉండటానికే వరుసగా సినిమాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.