తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిథి పట్టాభి మాల్దీవుల్లో తేలారు. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన పట్టాభి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. కాదు కాదు, పోలీసులే పట్టాభిని కిడ్నాప్ చేశారంటూ టీడీపీ హై డ్రామా క్రియేట్ చేసింది. చివరికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పట్టాభి మాల్దీవుల్లో తేలడం చర్చనీయాంశంగా మారింది.
పట్టాభి మాల్దీవులకు ఎలా వెళ్ళారు.? ముఖ్యమంత్రిని దూషించిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టాభి, ఇలా బెయిల్ తెచ్చుకుని.. అలా మాల్దీవులకు వెళ్ళడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పట్టాభికి సంబంధించిన తాజా ఫొటోలు (పట్టాభి విమానంలో వున్నవి కూడా..) వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.
కొద్ది రోజుల క్రితం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పట్టాభి తీవ్రస్థాయిలో దూషణలకు దిగారు.. అదీ టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి. దాంతో, వైసీపీ అభిమానులు పట్టాభి ఇంటిపైనా, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపైనా దాడి చేసి.. విధ్వంసమే సృష్టించారు.
అటు పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఇటు వైసీపీ అభిమానుల్నీ అరెస్ట్ చేయడం గమనార్హం. పట్టాభి మాత్రం ఎంచక్కా బెయిల్ తెచ్చుకుని, మాల్దీవులకు చెక్కేశారు. దాడి చేసిన వైసీపీ అభిమానులే అడ్డంగా బుక్కయిపోయారన్న వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
ధ్వంసమైన ఇంటిని సరిదిద్దుకోకుండా, అరెస్టు తదనంతర పరిణామాలపై మీడియాకి వివరణ ఇచ్చుకోకుండా పట్టాభి మాల్దీవులకు చెక్కేయడమేంటి.? మరోమారు అరెస్టు.. అన్న భయంతోనే పట్టాభి మాల్దీవులకు పారిపోయారా.? లేదంటే, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నవి పాత పొటోలా.? ఏమో, పట్టాభి ఈ వ్యవహారాలపై స్పందించాల్సి వుంది.