గత ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం చెందడంతో పలువురి నేతలు భవిష్యత్తు కోసం ఇతరత్రా పార్టీల వైపు చూశారు. వారిలో కొందరు వైసీపీ బాటపట్టగా ఇంకొందరు నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. వారిలో రాయపాటి సాంబశివరావు కూడ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తనకు, తన కుమారుడికి టికెట్ ఆశించారు. కానీ ఒక్కరికే ఇస్తానని చంద్రబాబు తెగేసి చెప్పడంతో చేసేది లేక తానే పోటీకి దిగారు. కానీ ఓడిపోయారు. ఓటమి తర్వాత పార్టీలో ఆయనకు ప్రాముఖ్యత కూడ తగ్గిపోయింది. కుమారుడు రంగారావును రాజకీయాల్లో పూర్తి యాక్టివ్ చేయాలని చూస్తున్నారు. పెదకూరపాడు టికెట్ తన కుమారుడికి దక్కించుకోవాలని ట్రై చేస్తున్నారు. అయితే అది కూడ సాధ్యమయ్యేలా లేదు. దీంతో ఆయన బీజేపీలో చేరాలని భావించారు. నిజానికి ఆయన చాలా నెలల క్రితమే బీజేపీలోకి వెళ్లిపోవాలని ట్రై చేశారు.
కానీ కన్నాలక్ష్మీనారాయణ అడ్డుపడ్డారని చెబుతుంటారు. కన్నాకు, రాయపాటికి వైరం ఈనాటిది కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఇరువురు నువ్వా నేనా అన్నట్టు పోటీపడేవారు. ఇద్దరికీ వైఎస్ మంచి ప్రాముఖ్యత ఇవ్వడంతో ఎవ్వరూ తగ్గేవారు కాదు. ఒకానొక దశలో కన్నా ఒక పెద్ద వివాదంలో చిక్కుకోవడానికి రాయపాటి సాంబశివరావు కారణమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దీంతో ఇద్దరి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. అలా ఉండగానే కాంగ్రెస్ పతనం కావడంతో ఇద్దరూ పార్టీ మారాల్సి వచ్చింది. రాయపాటి టీడీపీ బాట పట్టగా కన్నా బీజేపీలోకి వెళ్లిపోయారు. అలా కన్నా బీజేపీలో ఉండగానే అందులోకి వెళ్లాలని అనుకున్నారు రాయపాటి.
కానీ కన్నా అధ్యక్షుడి హోదాలో ఉండటంతో బీజేపీ హైకమాండ్ రాయపాటికి సానుకూలంగా స్పందించలేకపోయింది. దీంతో ఆయన కూడ సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పటికీ టీడీపీలో ఆయన పరిస్థితి మెరుగు కాలేదు. అధిష్టానం నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. దీంతో మరోసారి బీజేపీలో చేరే ప్రక్రియను రీస్టార్ట్ చేశారట ఆయన. ఎందుకంటే బీజేపీలో కన్నా పరిస్థితి మారిపోయింది. అధ్యక్ష పదవి కొల్పోవడంతో పాటు కేంద్ర నాయకత్వం అలసత్వాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆయన. పార్టీలో ఉన్నారనే కానీ ఆయన మాటకు విలువ అనేదే లేకుండా లేదు. దీంతో తన ప్రాభవాన్నే కాపాడుకోలేని స్థితిలో రాయపాటికి అడ్డు చెప్పడం జరగని పని. ఇది రాయపాటికి బాగా కలిసొచ్చే విషయం.
ఇక బీజేపీ ఎలాగూ నాయకుల కోసం వెతుకులాడుతోంది. రాయపాటి లాంటి సీనియర్ నేత పార్టీలో చేరుతానంటే కళ్ళకద్దుకుని తీసుకుపోతుంది. అందుకే మరోసారి చర్చలు షురూ అయినట్టు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి కూడ అడిగిన చోట టికెట్ ఇస్తామనే హామీ గనుక సోము వీర్రాజు నుండి వస్తే ఆయన జెండా మార్చడం ఖాయమని చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అంతేకాదు రాయపాటి బీజేపీలో చేరితే కన్నాకు సైతం ఒక మంచి జరిగే వీలుంది. ఆయన్ను సాకుగా చూపెట్టి బీజేపీ నుండి బయటకు వచ్చి ఎంచక్కా తెలుగుదేశంలో చేరిపోవచ్చు. అలా రెండు పార్టీల మధ్యన నాయకుల కుండమార్పిడి జరగొచ్చన్నమాట.