టీడీపీ పార్టీలో మహిళా నేతలు ఈ మధ్య తమ వ్యతిరేక స్వరాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు, బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా కానీ, తమ సన్నిహితుల వద్ద మాత్రం చంద్రబాబు మీద, పార్టీ తీసుకునే నిర్ణయాలు పట్ల తమ వ్యతిరేకత వ్యక్తం చేయటం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం లాంటివి చేస్తున్నారు, తాజాగా అదే వరసలో మాజీ మంత్రి పీతల సుజాత చేరినట్లు తెలుస్తుంది.
ఒకప్పుడు టీచర్ గా పనిచేస్తున్న పీతల సుజాత 2004 లో టీడీపీ నుండి రాజకీయ ప్రవేశం చేసి ఆంచట నుండి పోటీచేసి గెలిచారు, 2009 ఆమెకు సీటు రాకపోయినా పార్టీనే నమ్ముకొని ఉంది , ఆ తర్వాత 2014 లో చింతలపూడి నుండి గెలిచి, జిల్లాలో ఎక్కడినుండైనా పోటీచేసి విజయం సాధిస్తాననే సంకేతాలు పంపింది. ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసింది. ఎప్పుడైతే ఆమె మంత్రిగా మారిపోయిందో, అప్పటి నుండి జిల్లాలో ఆమెకు వ్యతిరేక వర్గం బాగా పెరిగిపోయింది.
మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్లతో అనేక ఇబ్బందులు పడింది, అదే సమయంలో క్యాబినెట్ విస్తరణ లో భాగంగా ఆమెకు మంత్రి పదవి పోయింది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు కనీసం పార్టీ టిక్కెట్ దక్కలేదు, అయిన కానీ ఆమె నిరుత్సహం చెందకుండా పార్టీకోసం పనిచేస్తుంది. ఇక పార్లమెంట్ స్థానాల వారీగా ప్రకటించిన అధ్యక్షులు, ఇంచార్జి పదవుల్లో పీతల సుజాత కు మొండి చెయ్యి ఎదురైంది. మొన్న ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా ఆమెకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు బాబు.
అదే సమయంలో తనకంటే జూనియర్ నేతలకు పదవులు వచ్చాయి. దీనితో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటుంది . తాజాగా నారా లోకేష్ వరద బాధిత రైతులను పరామర్శించటానికి వచ్చినప్పుడు ఆమె ఫోన్ స్విచ్ ఆపేసి, టీడీపీ నేతలకు అందుబాటులో లేకుండా వెళ్లినట్లు అక్కడి స్థానిక నేతలు చెపుతున్నారు.
ఆమెకు దళిత మహిళా నేతగా మంచి పేరుంది, పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన క్యాడర్ కూడా ఉంది , అయినా కానీ టీడీపీ పార్టీ ఆమె విషయంలో అంటీముట్టనట్లు ఉండటంతో, ఆమెను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగి పీతల సుజాత టీడీపీని వీడితే కచ్చితంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే దళితుల ఓటు బ్యాంకు టీడీపీ కి చాలా తక్కువ, అలాంటిది దళిత మహిళా నాయకురాలైన పీతల సుజాత వెళ్ళిపోతే , ఆ జిల్లాలో టీడీపీ కి మరింత గడ్డుకాలమే