టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోకపోతే.. అంతే సంగతులు.!

వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు.. వైసీపీ నేతల మీద తీవ్రమైన దూషణలు.. టీడీపీకి ఇదే నిత్యకృత్యమైపోయింది. వైసీపీ పుట్టాక, టీడీపీ నుంచి తీవ్రమైన రాజకీయ దాడిని ఎదుర్కొన్నా, తట్టుకుని గట్టిగా నిలబడింది. మరి, అందుకు బదులు తీర్చుకోవదద్దా.? అన్నది వైసీపీ వాదన. సరే, రాజకీయాల్లో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలేనా.? అభివృద్ధి ఆలోచన ఏమీ లేదా.? అంటే, అది వేరే చర్చ. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, గడచిన రెండేళ్ళుగా చేస్తున్న రాజకీయాలతో, టీడీపీ నానాటికీ అత్యంత దారుణంగా తయారవుతోంది. టీడీపీ తరఫున మీడియా ముందుకొస్తున్నవారెవరూ బాధ్యత గల రాజకీయ నాయకుల్లా మాట్లాడటంలేదు.

టీడీపీకి 2019 ఎన్నికల్లో జనం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ముగ్గురు ఎంపీలు, టీడీపీ నుంచి గెలిచారు. వారిలో ఎంతమంది ఆ పార్టీలో వున్నారు.? ఎంతమంది పార్టీ కోసం నిఖార్సుగా పనిచేస్తున్నారు.? అన్న విషయమై చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకో రెండున్నరేళ్ళు ఇదే తరహా మాటల దాడి కొనసాగించడం వల్ల టీడీపీకి, ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుందా.? పెరగదు, మరింత డ్యామేజ్ అయిపోతుంది. అధికారంలో ఐదేళ్ళున్న చంద్రబాబు. వైఎస్ జగన్ అవినీతిపరుడైతే, ఆ అవినీతిని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు వెలికి తీయలేకపోయింది.? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నవుతుంది. దానికి సమాధానం చెప్పలేని దుస్థితి టీడీపీ. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్న సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా అమలవుతున్నాయంటే, ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అభినందించి తీరాలి.