టీడీపీ పోటీ చేయకపోతే, ఎవరికి నష్టం.?

TDP Has No Interest In ZPTC, MPTC Elections
TDP Has No Interest In ZPTC, MPTC Elections
పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించేస్తోందట తెలుగుదేశం పార్టీ. ఇదెక్కడి విడ్డూరం. అక్కడిదాకా ఎందుకు.? తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను బహష్కరించేయొచ్చు కదా.? అది వేరే లెక్క. ఇక్కడ లెక్కలు తేడా రాకూడదు. అందుకే, పరిషత్ ఎన్నికల మీద తమ ప్రతాపం చూపుతోంది టీడీపీ. రాష్ట్రంలో పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల వేళ అరాచక రాజకీయం రాజ్యమేలిన మాట వాస్తవం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా ఇదే తంతు. స్థానికంగా వున్న పరిస్థితులు అలాంటివి. పార్టీల జెండాలు కలిసిపోయాయి.. స్థానిక పరిస్థితుల్ని బట్టి కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థి గెలుపుకు వైసీపీ సహకరించిన సందర్భాలూ వున్నాయంటూ మీడియాలో వార్తల్ని చూశాం.
 
జనసేనను టీడీపీ గెలిపించింది. అదే జనసేన మీద అక్కసుతో టీడీపీ, వైసీపీకి మద్దతిచ్చింది. ఇలాంటి సిత్రాలు చాలా జరిగాయి. ఇప్పుడేమో కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారు గనుక, టీడీపీ ఆ ఎన్నికల్ని బహిష్కరించాలనుకుంటోంది. ఇందుకోసం ఓ ‘సాకు’ వెతుక్కుంది టీడీపీ. అదే పాత నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ద్వారా పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే.. అసలు ఆ ఎన్నికలకే అర్థం లేదని. ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శించాల్సి వుంది. ఎలాగూ ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే గనుక, కొత్త నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వ పెద్దలూ కీలక నిర్ణయం తీసుకుంటే మంచిదేమో. ప్రభుత్వ నిర్ణయాన్ని (అధికార పార్టీ పెద్దలే ప్రభుత్వ పెద్దలు) బట్టి ఎస్ఈసీ వ్యవహరిస్తారా.? లేదా.? అన్నది వేరే చర్చ. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసం కలగాలంటే, కొత్త నోటిఫికేషన్ తప్పనిసరి. కానీ, అది జరిగే పనిలా కనిపించడంలేదు. పరిస్థితి ఎలా వున్నా, ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల్లో పోటీ చేసి తీరాలి. పోటీ చేయని పక్షంలో.. తమ చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లే.