వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సొంత సామాజికవర్గమైన రెడ్డి సామాజిక వర్గాన్ని పెద్ద పీఠ వేస్తున్నారని, మంత్రివర్గంలో అలాగే కీలమైన నామినేటెడ్ పదవుల్లో రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులకే పదవులు దక్కుతున్నాయని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీలో అత్యధికులు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉండటం జగన్ చుట్టూ ఉంటూ కీలక నేతలుగా చెలామణీ అవుతున్న వారిలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా రెడ్డి వర్గీయులే ఉండటం ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం కీలక పదవుల్లో కూడ రెడ్డి సామాజిక వర్గం నేతలే ఉండటం రాజకీయ ప్రత్యర్థులకు కలిసొచ్చింది.
ఇప్పటికే చైర్మన్ పదవిలో వైవీ సుబ్బారెడ్డి ఉండగా ఈవోగా జవహర్ రెడ్డిని నియమిస్తున్నట్టు వార్తలు రావడం మరింత చర్చనీయాంశమైంది. టీటీడీ ఈవోగా అనీల్ కుమార్ సింఘాల్ ఉండగా ఆయన్ను తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనీల్ కుమార్ సింఘాల్ చంద్రబాబు హయాంలో ఈవోగా నియమితమయ్యారు. వైసీపీ సర్కార్ వచ్చినా ఆయన పదవికి ఢోకా రాలేదు. పదవీ కాలం ముగిసినా ఆయన ప్రభుత్వంతో సంబంధం లేకుండా పదవీకాలాన్ని పొడిగించుకున్నారు. కానీ పదవి పొడిగించుకుని రెండు నెలలు కాకముందే ఆయన్ను పదవి నుండి తప్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకుంది.
ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే తగిన క్యాడర్ లేకపోవడంతో అయన ఎక్కువ కాలం ఈవోగా ఉండలేరు. అందుకే ఆయన స్థానంలో వైద్య శాఖలో ఉన్న జవహర్ రెడ్డిని ఈవోగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా టీటీడీ కీలక పదవిలో మరొక రెడ్డి వర్గానికి అధికారి చేరడంతో టీటీడీకి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, ఈవోగా జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవోగా ధర్మారెడ్డి ఉంటారు.
ఇలా నాలుగు కీలక పదవుల్లో రెడ్డి వర్గానికి చెందిన వారే ఉండటంతో జగన్ రాజకీయ ప్రత్యర్థులకు ఒక ఆయుధంలా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర వర్గాలను నిర్లక్ష్యం చేసి రెడ్లకు రాజ్యం అప్పగిస్తున్నారని అంతెత్తున ఎగురుతున్న టీడీపీ ఈవోగా అనీల్ కుమార్ సింఘాల్ ను తొలగించి జవహర్ రెడ్డిని నియమించడం కేవలం కుల రాజకీయమేనని ఆరోపణలు మొదలుపెట్టినా పెట్టవచ్చు. కాబట్టి వైఎస్ జగన్, ఇతర నేతలు సరైన వివరణను దగ్గరపెట్టుకుని టీడీపీ సంధించబోయే విమర్శాస్త్రాలకు ఎదుర్కొనడానికి సిద్దంగా ఉంటే మంచిది.