ప్రతిపక్ష నేత చంద్రబబు నాయుడుకు పెద్ద చిక్కే వచ్చి పడింది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలే ఈ చిక్కును తెచ్చిపెట్టాయి. ఈ ఎన్నికల విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు చంద్రబాబు. పోటీచేస్తే ఒక ఒక బాధ చేయకపోతే ఇంకో బాధ అనేలా ఉంది సిట్యుయేషన్. ఇటీవల కన్నుమూసిన బల్లి దుర్గాప్రసాద్ రావు టీడీపీకి అత్యంత సన్నిహితుడు. రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అధిష్టానానికి వీర విధేయుడనే పేరుంది ఆయనకు. గూడూరు నుండి టీడీపీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. గత ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారారు.
ఓడిపోవడం ఖాయం
ఆయన మరణించడంతో ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబం నుండే ఒకరికి టికెట్ ఇవ్వనున్నారు జగన్. అసలే సిట్టింగ్ ఎంపీ. మంచి పేరున్న నేత. ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. అన్నిటినీ మించి సానుభూతి ఎఫెక్ట్ గట్టిగా పనిచేస్తుంది. ఇన్ని ప్రతికూలతలు నడుమ టీడీపీ బరిలోకి దిగితే గెలవడం మాట అటుంచి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఈ సంగతి చంద్రబాబుకు కూడా తెలుసు. ఓడిపోతే పర్వాలేదు కానీ ఆ ఓటమిని అమరావతికి ముడిపెట్టి మూడు రాజధానులు అడ్డుపడుతున్నారు కాబట్టే ప్రజలు ఊడగొట్టారని అధికార ప్రభుత్వం తప్పకుండా అంటుంది.
పిరికివాడనే ముద్ర వేస్తారు
ఓటమికి భయపకుండా బరిలోకి దిగుదామని అనుకున్నా అక్కడ ఇంకో సమస్య వెంటాడుతోంది. అదే బల్లి దుర్గాప్రసాద్ రావుతో ఉన్న అనుబంధం. దాదాపు ఆయనతో మూడున్నర దశాబ్దాల అనుబంధం టీడీపీది. ఆయన విధేయత ఏలాంటిదో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి మరణించిన చోట ఉప ఎన్నికలకు అతని కుటుంబం మీదకే పోటీకి దిగడం సరైనది కాదని, గౌరవ సూచకంగా ఎన్నికల్లో నిలబడకూడదనే ఆలోచనలో కూడ ఉన్నారు బాబు. కానీ అలా చేస్తే ఇంకో చిక్కుంది. ఓటమికి భయపడే చంద్రబాబు నాయుడు పోటీకి దిగలేదని, దూరప్రసాద్ మీద గౌరవం అని వంకలు చెబుతున్నారని అంటూ వైసీపీ శ్రేణులు తప్పకుండా ఆయన మీద పిరికివాడనే ముద్ర వేస్తాయి.
దీంతో ఎటూ తేల్చుకోలేక ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది బాబు పరిస్థితి. మరి 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన ఈ విపత్కర పరిస్థితి ఎలా బయటపడాతారో చూడాలి.