ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని వ్యక్తిగత అంశాలు ఇప్పటికీ వివాదాలుగానే ఉన్నాయి. వాటిలో లక్ష్మీ పార్వతి అంశం కూడ ఒకటి. మొదటి నుండి ఆమెకు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అస్సలు పొసగదు. దాదాపు పెద్దాయన కుటుంబమంతా ఆమెను వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు సరేసరి. బాబంటే లక్ష్మీ పార్వతికి పీకల వరకు కోపం ఉంది. ఆయన మీద పంతం సాధించడానికే ఆమె వైసీపీలో చేరారు. జగన్ సైతం అవసరమైనప్పుడు ఏదీ లేకపోతే చంద్రబాబు మీద ఒక ఆయుధంగా ప్రయోగించడానికి అక్కరకు రావొచ్చని ఆమెకు పార్టీలో కల్పించారు. వీరందరి సంగతి ఎలా ఉన్నా టీడీపీ శ్రేణుల్లో లక్ష్మీ పార్వతి అంటే వ్యతిరేక భావం ఇంకా రగులుతూనే ఉంది.
మొదట్లో కొద్ది మొత్తంలో మాత్రమే ఉన్న ఈ వ్యతిరేక భావనకు చంద్రబాబు ఆజ్యంపోసి రెట్టింపు చేశారు. ఆమెను పార్టీకి, ఎన్టీఆర్ అభిమానులకు దూరం చేశారు. ఇక ఆమె వెళ్లి వైసీపీలో చేరడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇంకా రగిలిపోయారు. ఇన్నాళ్లు వ్యక్తిగతంగానే ఇబ్బందికరంగా ఉన్న ఆమె ఇప్పుడు రాజకీయంగా కూడ అడ్డం తిరిగారని భావిస్తున్నారు. ఈ భావన ఎంతవరకు వచ్చిందంటే పెద్దాయన్నే పక్కనబెట్టేంత దూరం వచ్చింది. కొన్నాళ్ల క్రితం నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించింది. ఈ విషయంలో లోకల్ లీడర్లే కాదు స్వయంగా బాలయ్య సైతం నొచ్చుకున్నారు.
నేరుగా కలుగజేసుకుని లోకల్ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో మాట్లాడి విగ్రహ ఏర్పాటు మీద హామీ తీసుకున్నారు. అక్కడి టీడీపీ శ్రేణులైతే విగ్రహ ఏర్పాటును ప్రతిష్టగా భావించి నిత్యం అధికార పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు. లోకల్ వైసీపీ నేతలు బాలయ్యకు ఇచ్చిన మాట మేరకు కొత్త ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మామూలుగా అయితే బాలయ్య ప్రిస్టేజ్ ఇష్యుగా భావించిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు టీడీపీ నేతలు, శ్రేణుల హడావుడి ఎక్కువగా ఉండాలి. వాళ్ళు కూడా హంగామా చేయాలనే అనుకున్నారు.
కానీ ఉన్నట్టుండి లక్ష్మీ పార్వతి రంగంలోకి దిగడంతో బాలయ్య సహా అందరూ షాకై ఉంటారు. విగ్రహ ఆవిష్కరణకు వైసీపీ నేతలు లక్ష్మీ పార్వతిని తీసుకురావడంతో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు ఆవిష్కరణ వేడుకకు వెళ్లలేకపోయారు. ప్రత్యర్థి పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలోనే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరిగిపోయింది. దీంతో కావలి మాత్రమే కాదు మొత్తం నెల్లూరు జిల్లా టీడీపీ శ్రేణులు తీవ్ర భంగపాటుకు గురవుతున్నారు. లక్ష్మీ పార్వతి వెళ్తూ వెళ్తూ మీడియా ముందు చంద్రబాబును జైల్లో వేయించేవరకు నిద్రపోనని శపథం చేసి వెళ్లడం టీడీపీ అభిమానులను మరింతగా రెచ్చగొట్టేలా చేసింది.