టార్గెట్ కుప్పం.! వైసీపీ కొత్త గేమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.?

‘కుప్పంలో భరత్‌ని ఎమ్మెల్యేగా గెలిపించండి.. ఆయన్ని మంత్రిగా చేసే బాద్యత నాది..’ అంటూ కుప్పం నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. సుమారు 50 మందితో ఈ భేటీ నిర్వహించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.

ప్రతి నియోజకవర్గం నుంచీ ఇలాగే 50 మందిని పిలిపించుకుని, వారితో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల్ని అడిగి తెలుసుకుని, వాటి అభివృద్ధి కోసం నిధుల్ని ప్రత్యేకంగా కేటాయిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పబోతున్నారా.? ప్రతి నియోజకవర్గానికీ మంత్రి పదవి సాధ్యమేనా.?

నిజానికి, కుప్పం లెక్క వేరు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత కొంతకాలంగా తిరుగులేని విజయాల్ని అందుకుంటున్న నియోజకవర్గమది. అక్కడ కొడితే, టీడీపీ పూర్తిగా గల్లంతయిపోతుందన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం.

కుప్పం మునిసిపాలిటీకి సంబంధించి అభివృద్ధి నిథుల కింది 65 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని వైఎస్ జగన్ హామీ ఇవ్వడం వరకూ బాగానే వుంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికీ ఇలా 65 కోట్లు ఇచ్చే పరిస్థితి వుంటుందా.? వుండదా.?

రాజకీయాలు చాలా చాలా చిత్రమైనవి. కుప్పం నియోజకవర్గంపై వైసీపీ అధినేత ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కి సంబంధించిన న్యూడ్ వీడియో లీక్ అయ్యింది. తద్వారా వైఎస్ జగన్ ప్లాన్ మొత్తం బెడిసికొట్టినట్లయ్యింది. ‘ముందైతే, ఇలాంటోళ్ళని పార్టీ నుంచి తరిమికొట్టండి..

ఆ తర్వాత వేరే విషయాలు మాట్లాడండి..’ అని వైసీపీ కార్యకర్తలే, సోషల్ మీడియా వేదికగా అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నారాయె.!