కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. గురువారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం నారాయణ స్వామి, ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు.
ఆ తర్వాత గవర్నర్ తమిళిసైను విపక్ష ఎమ్మెల్యేలు కలవనున్నారు. బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరనున్నారు.పుదుచ్చేరిలో వరుస రాజీనామాలతో నారాయణస్వామికి అసమ్మతి సెగ తగులుతోంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో సభలో బలం తగ్గింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్‌దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా సోమవారం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, మంగళవారం ఎమ్మెల్యే జాన్‌కుమార్ రాజీనామా చేశారు.
ప్రస్తుతం నలుగురు రాజీనామా చేయగా.. నారాయణస్వామి బలం 14కు పడిపోయింది. శాసనసభలో 30 స్థానాలకు గానూ, మ్యాజిక్ ఫిగర్ 15. కాగా, గతంలో కాంగ్రెస్ కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మరో రెండు నెలల్లో పుదుచ్చేరి శాసనసభలు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.