తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో జస్టిస్ హిమాకోహ్లితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, పరిమిత సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు.
ఇప్పటి వరకు సీజేగా ఉన్న జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ బదిలీపై ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో పదోన్నతిపై జస్టిస్ హిమా కోహ్లి బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ హిమ కోహ్లీ తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు.
జస్టిస్ హిమా కోహ్లీ 1959, సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్ నుంచి పాఠశాల విద్యాభ్యాసం, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం హిస్టరీలో పీజీ, ఎల్ఎల్‌బీ పూర్తిచేసి 1984లో ఢిల్లీ యూనివర్సిటీ లా సెంటర్‌లో ఫ్యాకల్టీగా చేరారు. 2006లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమై 2007, ఆగస్టు 29న శాశ్వత జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత వివిధ కమిటీలకు చైరపర్సన్‌గా పనిచేసి, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సీజేగా ఎంపికయ్యారు.