తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్లుగా వెలుగొందుతోన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు. తెలుగు సినిమాలకీ సుపరిచితుడే. ఈ హీరో పేరు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. దివంగత జయలలితకు అజిత్ అత్యంత సన్నిహితుడు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు అజిత్ చేతికి దక్కుతాయనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడీ హీరో ప్రస్తావన ఎందుకంటే, అజిత్.. నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒకింత అసహనానికి గురయ్యాడు. ఓ అభిమాని మొబైల్ ఫోన్ లాక్కున్నాడు.. అతని మీద చిరాకుపడ్డాడు. అదేంటీ, ఇలాంటి విషయాల్లో పేటెంట్ రైట్స్ మన బాలయ్యబాబుకి కదా వున్నది.? అని చాలామంది తెలుగు సినీ అభిమానులు ఆశ్చర్యపోయారు. బాలయ్య అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దబిడి దిబిడే.. అంటాడు. అజిత్ అలా చేయలేదు, జస్ట్ మొబైల్ ఫోన్ లాక్కున్నాడంతే. విషయమేంటంటే, క్యూ లైన్‌లో నిల్చుని ఎలాంటి హంగామా లేకుండా ఓటేశాడు అజిత్. అయితే, ఓ అభిమాని అత్యుత్సాహం చూపాడు.
అజిత్ వద్దంటున్నా వినలేదు. దాంతో, మొబైల్ ఫోన్ లాక్కోవాల్సి వచ్చింది. ఆ తర్వతా ఆ మొబైల్ ఫోన్ ఆ అభిమానికి చేరిందనుకోండి.. అది వేరే సంగతి. చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు ఓ సెల్ఫీ లాగేసుకుందామని అభిమానులు పోటీ పడటం వింతేమీ కాదు. కానీ, సమయం.. సందర్భం వుండాలి కదా. ఇదిలా వుంటే, మరో తమిళ హీరో విజయ్, పోలింగ్ కేంద్రానికి సైకిల్ మీద వెళ్ళడం పెద్ద దుమారం రేపింది. అయితే, ఇంటి పక్కనే వున్న పోలింగ్ బూత్‌కి వెళ్లేందు కోసం కారు తీసుకెళ్ళే అవకాశం లేకపోవడంతోనే విజయ్, సైకిల్ మీద వెళ్ళాడని అతని సన్నిహితులు వివరణ ఇచ్చారు. అప్పటిదాకా, విజయ్ సైకిల్ మీద వచ్చింది కేవలం పెట్రోధరల పట్ల నిరసన తెలపడానికేనని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.