తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. పాపులర్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో కోలీవుడ్ పరిశ్రమ దిగ్బ్రాంతిలోకి జారిపోయింది. ఈరోజు ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 5 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా శుక్రవారం ఉదయం ఇంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట్లో వ్యాక్సిన్ వికటించడం వలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని అందరూ భావించారు.
కానీ వైద్యులు మాత్రం వ్యాక్సిన్ కు,ఆయన హెల్త్ కండిషన్ దెబ్బతినడానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. గురువారం నుండి ఐసీయూలోనే ఉన్న ఆయన చికిత్స అందిస్తుండగానే కన్నుమూశారు. వివేక్ తమిళనాట పాపులర్ సెలబ్రిటీ. రజినీకాంత్, సూర్య, అజిత్, విజయ్ లాంటి అగ్రహీరోలు అందరితోనూ ఆయన పనిచేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన. సినిమాల్లోనే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడ వివేక్ చురుగ్గా ఉండేవారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు కార్యక్రమాలు చేసేవారు ఆయన. వివేక్ కు ముగ్గురు పిల్లలు కాగా కొన్నేళ్ల క్రితం ఒక కొడుకు డెంగూ జ్వరంతో మృతి చెందాడు.