దళిత బంధుని తన ఖాతాలో వేసుకున్న ఈటెల

‘నేను రాజీనామా చేయబట్టే దళిత బంధు పథకం తెరపైకి వచ్చింది. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబట్టే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అధికార పార్టీ కళ్ళు తెరిచింది..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ‘ఎమ్మెల్యేగా, మంత్రిగా వున్న సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేశాను..’ అని పదే పదే చెప్పుకుంటోన్న ఈటెల, ఇప్పుడు అధికార పార్టీ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిందని చెప్పడమేంటట.? అంటే, అప్పట్లో అభివృద్ధి జరగలేదనే కదా అర్థం.? ఒక్కటి మాత్రం నిజం.. ఈటెల రాజేందర్ గనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వుండకపోతే, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చి వుండకపోతే దళిత బంధు అనే పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అమలు చేసేవారే కాదు.

ఇక, హుజూరాబాద్ నియోజకవర్గంలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అప్పుడే డబ్బు పంపిణీ కార్యక్రమాలూ షురూ అయ్యాయి. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వయంగా డబ్బులు పంచుతున్న వైనం సోషల్ మీడియాలో వీడియోల రూపంలో కనిపిస్తోంది. ‘తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు, ఎవరు కరెన్సీ నోట్లు ఇచ్చినా తీసుకుంటాం.. ఈటెల రాజేందర్‌కి మాత్రమే ఓటు వేస్తాం..’ అని కొందరు తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా కట్టుకున్న కార్యకర్తలు చెబుతుండడం గమనార్హం. అయితే, ఇదంతా బీజేపీ మార్కు పొలిటికల్ స్టంట్ అనీ, డబ్బు పంపిణీ ఆరోపణల్లో నిజం లేదనీ తెలంగాణ రాష్ట్ర సమితి చెబుతోంది. ఏదిఏమైనా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కాక మాత్రం పతాక స్థాయికి చేరుకుంటోంది. కరోనా నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేదనే ప్రచారం జరుగుతున్నా, రాజకీయ పార్టీలు రాజకీయ హడావిడి మాత్రం తగ్గించడంలేదు.