Supreme Question: కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంటే, వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పిల్ల చేష్టలు చేస్తోందన్న విమర్శలున్నాయి. కరోనా వైరస్ నుంచి దేశం బయటపడాలంటే, అందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. 130 కోట్ల మంది జనాభా కలిగిన భారతదేశం, రికార్డు సమయంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయకపోతే, జరిగే నష్టం అంచనాలకు అందదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదా.? తెలిసీ, ఎందుకు వ్యాక్సినేషన్ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది.? మే 1.. అంటే, రేపట్నుంచే 18 ఏళ్ళ పైబడిన అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఆలోచన మంచిదే, ఆచరణ ఎలా.? అన్నదే ఇక్కడ ప్రశ్న.
చాలా రాష్ట్రాలు మే 1 నుంచి 18 ఏళ్ళ పైబడినవారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమంటోంది. ప్రస్తుతం అమల్లో వున్న 45 ఆ పై బడినవయసు వారికి వ్యాక్సినేషన్ సైతం కొనసాగింపు కష్టమేనన్న అభిప్రాయంతో రాష్ట్రాలున్నాయి. కొత్తగా 18 నుంచి 45 ఏళ్ళ మధ్య వయసున్నవారికి వ్యాక్సినేషన్ అందించాలంటే, అందుకు వీలుగా దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో వుండాలి. వ్యాక్సిన్లు లేవుగానీ, అందరికీ వ్యాక్సిన్లు.. అంటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్రం ప్రారంభించేసింది. దాదాపు రెండున్నర కోట్ల రిజిస్ట్రేషన్లు కేవలం 24 గంటల పరిధిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కానీ, అక్కడ వ్యాక్సిన్ లభ్యత.. పదో వంతు కూడా వున్నట్టు కనిపించడంలేదు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.
వ్యాక్సినేషన్ కోసం జాతీయ విధానం ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి వుందా.? అని ప్రశ్నించింది. అంతే కాదు, కేంద్రమే వ్యాక్సిన్లు సేకరించి, రాష్ట్రాలకు అందివ్వాలి కదా.? అని కూడా నిలదీసింది. కేంద్రం ఒక ధరకు, రాష్ట్రాలు ఇంకో ధరకు వ్యాక్సినేషన్ సమకూర్చుకోవడమేంటని కూడా మండిపడింది. ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ నిర్ణయం.? అన్నదానిపై సామాన్యుల్లోనూ చాలా అనుమానాలున్నాయి. వ్యాక్సినేషన్ తీరుతో, ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో పలచనైపోయిందన్నది నిర్వివాదాంశం.