జగన్ సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తాకింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై గతంలో ఏపీ హైకోర్టు ఇఛ్చిన స్టాటస్ కో ఉత్తర్వులను రద్దు చేయాలంటూ… సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఆ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం ఆభ్యర్థనను తిరస్కరించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. ఈ అంశం ఇదివరకే ఏపీ హైకోర్టులో విచారణలో ఉన్నందున ఇప్పుడు దీనిపై సుప్రీం జోక్యం చేసుకోలేదంటూ వెల్లడించింది.
అయితే.. మూడు రాజధానుల అంశంపై ఈనెల 27న హైకోర్టులో విచారణ జరగనుంది. ఈనేపథ్యంలో హైకోర్టులో విచారణ జరగకముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
అయితే.. ఈ కేసును నిర్ణీత గడుపులోపే హైకోర్టులో విచారణ ముగిసేలా సుప్రీం.. ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టులో విచారణలో ఉన్న కేసును త్వరగా ముగించాలంటూ తాము ఆదేశించలేము.. అంటూ స్పష్టం చేసింది.
ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్టాటస్ కో ఉత్తర్వులను జారీచేసింది. మళ్లీ విచారణ ఈనెల 27న హైకోర్టులో జరగనుంది.