అసలు రజనీకాంత్ అనే సూపర్ స్టార్ ఎందుకిలా అయిపోయాడు.? రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని ఓ సారి, రాజకీయాల్లోకి రావడంలేదని ఇంకోసారి.. తనను నమ్మకున్న లక్షలాది మంది, కోట్లాదిమంది అభిమానుల్ని ఎందుకిలా వేధిస్తున్నాడు.? ఈ చర్చ సోషల్ మీడియాలో రజనీకాంత్ అభిమానుల్లోనే జరుగుతోంది. అనారోగ్య కారణాలతో రజనీకాంత్, రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనల్ని పక్కన పెట్టేసిన విషయం విదితమే.
తాను రాజకీయాల్లోకి రావడంలేదని కొన్నాళ్ళ క్రితమే స్పష్టం చేసేసిన రజనీకాంత్, ఇంకోసారి అదే విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు. రాజకీయ పార్టీ కోసమంటూ రజనీ మక్కల్ మండ్రమ్ అనే వేదికని గతంలో స్థాపించిన రజీనాకంత్, దాన్నిప్పుడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రజనీకాంత్ అభిమానుల సంఘం మాత్రం అలాగే వుంటుందట.
కొన్నాళ్ళ క్రితమే రజనీకాంత్, కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పుని ప్రజలు కోరుకుంటున్నారనీ, మెరుగైన పాలన తన నాయకత్వంలో ప్రజలకు అందించాలని అనుకుంటున్నాననీ రజనీకాంత్ చెప్పారు. అయితే, అనూహ్యంగా రజనీకాంత్ ‘అన్నాత్తె’ సినిమా షూటింగులో అస్వస్థతకు గురయ్యారు. అంతే, ఆ తర్వాత సీన్ మారిపోయింది.
బీజేపీ పెద్దల హితబోదతో రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనని రజనీకాంత్ విరమించుకున్నారనే ప్రచారం జరిగింది. లేదంటే, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేసేవారే. సరే, కొత్త పార్టీ పెట్టిన కమల్ హాసన్ ఏం సాధించాడు.? అంటే, అది వేరే చర్చ. రజనీకాంత్ వేరు, ఆయనకున్న ఫాన్ ఫాలోయింగ్ వేరు. అయినాగానీ, రజనీకాంత్ తన అభిమానుల సెంటిమెంట్లతో ఆడుకుంటున్న తీరు అస్సలేమీ బాగాలేదు.