Sukumar: పుష్ప థ్యాంక్యూ మీట్ లో టెక్నీషియన్లకు రూ.లక్ష ప్రకటించిన సుకుమార్

Sukumar: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను.. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మార్చేశారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ స్టైల్ ను, గ్లామర్ ని పక్కకు పెట్టి.. అతనిలోని టాలెంట్ ను బయటికి తీశారు సుక్కు. పుష్ప ది రైజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17వ తేదీన విడుదలై.. ఇప్పటికీ బాక్సఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ లో పాత రికార్డులను మొత్తం చెరిపేసి.. కొత్త రికార్డులను సృష్టించే దిశగా పుష్పరాజ్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ.275 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. కేరళతో పాటు.. బీ టౌన్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది.

పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో.. ఆ సినిమా టీమ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్ లో థాంక్యూ మీట్ ఘనంగా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సినిమా కోసం కష్టపడిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు సుక్కు. పుష్ప సినిమాకు పనిచేసిన కిందిస్థాయి టెక్నీషియన్లు.. అంటే ప్రొడక్షన్, సెట్ అండ్ లైట్ మెన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించి.. తన ఉదారతను చాటుకున్నారు సుకుమార్.

ఈ సందర్భంలో తన కష్టంలో సగభాగం భార్య తబితకే చెందుతుందంటూ ఆమెకి థ్యాంక్స్ చెప్పారు సుకుమార్. ఈ సమయంలో ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌కు పాదాభివందనం చేశారు సుకుమార్. అంతేకాకుండా నిర్మాతల దగ్గర నుండి ఆర్టిస్టులతో పాటు ప్రతి టెక్నీషియన్‌కి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు సుక్కు. ఇలా ఆయన మాట్లాడుతుండగానే.. అల్లు అర్జున్ కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాలో ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అంటూ సమంత ఐటెం సాంగ్ లో కనిపించగా.. ఆమె తన ఫేవరెట్ హీరోయిన్ అని తెలిపారు సుకుమార్. అలాగే ఈ సినిమాకోసం తాను ఏం చెప్పినా బన్నీ కాదనకుండా చేశాడని పొగిడారు.